Bitcoin: క్రిప్టో ప్రపంచంలో ‘మహా పతనం’.. బిట్‌కాయిన్ ఇన్వెస్టర్ల కొంపముంచిన ఫెడ్ భయం!

Bitcoin Crash Investors Hit by Fed Fear
  • కనిష్ఠానికి పడిపోయిన బిట్‌కాయిన్
  • ఒక్కరోజులోనే 100 కోట్ల డాలర్ల ఆవిరి
  • టెక్ షేర్ల అమ్మకాలతో క్రిప్టో విలవిల
డిజిటల్ బంగారంలా వెలిగిపోతుందనుకున్న క్రిప్టో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. గురువారం ట్రేడింగ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ‘బిట్‌కాయిన్’ విలువ 13 శాతం మేర క్షీణించి, సుమారు 63,295 డాలర్ల వద్ద 15 నెలల కనిష్ఠ స్థాయిని తాకింది. 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి కొనసాగుతున్న జోష్‌ను ఈ తాజా పతనం పూర్తిగా తుడిచిపెట్టేసింది. గత అక్టోబర్‌లో 1.26 లక్షల డాలర్ల రికార్డు స్థాయిని తాకిన బిట్‌కాయిన్, ఇప్పుడు ఆ గరిష్ఠాల నుంచి సగానికి పైగా విలువను కోల్పోవడం గమనార్హం.

కేవలం 24 గంటల వ్యవధిలోనే క్రిప్టో మార్కెట్లో సుమారు బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,300 కోట్లు) విలువైన పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ప్రపంచ క్రిప్టో మార్కెట్ ఏకంగా 2 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. రెండో అతిపెద్ద కరెన్సీ అయిన ‘ఇథీరియం’ కూడా 13 శాతానికి పైగా నష్టపోయి 1,854 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బిట్‌కాయిన్ మైనింగ్ చేసే కంపెనీలు సైతం తమ వద్ద ఉన్న నిల్వలను అమ్మకానికి పెట్టవచ్చనే వార్తలు ఇన్వెస్టర్లలో మరింత గుబులు రేపుతున్నాయి.

క్రిప్టో పతనానికి కేవలం ఒక్క కారణం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలు తోడయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను ట్రంప్ నామినేట్ చేయడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఆయన కఠినమైన ద్రవ్య విధానాలను అనుసరిస్తారనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై అంచనాలు తగ్గడంతో నాస్‌డాక్ వంటి అంతర్జాతీయ టెక్ ఇండెక్స్‌లు కుప్పకూలాయి. బిట్‌కాయిన్ కదలికలు టెక్ షేర్లతో ముడిపడి ఉండటంతో ఈ సెగ క్రిప్టోకు తగిలింది. బంగారం, వెండి ధరల్లో కనిపిస్తున్న విపరీతమైన అస్థిరత కూడా ఇన్వెస్టర్లను రిస్క్ అసెట్స్ నుంచి వెనక్కి తగ్గేలా చేసింది. 

ప్రస్తుత పతనం స్వల్పకాలిక సర్దుబాటు కాదని, మార్కెట్ పూర్తిగా గడ్డు కాలంలోకి ప్రవేశించిందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సంస్థాగత పెట్టుబడిదారులు క్రిప్టో ఈటీఎఫ్‌ల నుంచి బిలియన్ల కొద్దీ నిధులను వెనక్కి తీసుకుంటుండటం మార్కెట్ బలహీనతను స్పష్టం చేస్తోంది. బిట్‌కాయిన్ 60 వేల డాలర్ల స్థాయిని నిలబెట్టుకోకపోతే, అది మరింత దిగువకు జారుకునే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
Bitcoin
Bitcoin crash
cryptocurrency
crypto market
Federal Reserve
Kevin Warsh
Ethereum
cryptocurrency market
Donald Trump
crypto ETFs

More Telugu News