మొంథా తుఫాను ప్రభావం... అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Add ap7am to your home Screen

మొంథా తుఫాను ప్రభావం... అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు

Revanth Reddy Orders Alert for Montha Cyclone Impact
  • రైతులకు నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
  • మొంథా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
  • ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై హైడ్రా, జీహెచ్ఎంసీ వెంటనే స్పందించాలన్న ముఖ్యమంత్రి
మొంథా తుపాను తీవ్ర వాయుగుండంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాయుగుండం ప్రభావంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని, వారికి దిశానిర్దేశం చేశారు.

వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మొంథా తుపాను ప్రభావం అధికంగా ఉండగా, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారిమళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి, లోతట్టు ప్రాంతాల కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.

నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లకు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు.

రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిలువ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించే అవకాశం ఉన్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

వైద్యారోగ్య శాఖ తగినంత మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశునష్టం చోటుచేసుకోకుండా శాఖలు జాగ్రత్తలు వహించాలన్నారు.

రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
Advertisement
Revanth Reddy
Montha Cyclone
Telangana Rains
Heavy Rainfall
Weather Alert
Telangana Government

More Telugu News