Amir Khan Muttaqi: భారత గడ్డపై నుంచి పాకిస్థాన్ కు ఆఫ్ఘనిస్థాన్ వార్నింగ్... ఇండియాపై ప్రశంసలు

Afghanistan minister Amir Khan Muttaqi Warns Pakistan from Indian Soil Praises India
  • ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టామన్న తాలిబన్లు
  • తమ బాటలోనే నడవాలంటూ పాకిస్థాన్‌కు ఆఫ్ఘన్ మంత్రి హితవు
  • తమ ధైర్యాన్ని పరీక్షించవద్దంటూ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక
భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ, పొరుగు దేశం పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని స్పష్టం చేసిన ఆయన, శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ కూడా తమ మార్గాన్ని అనుసరించాలని హితవు పలికారు. అంతేకాకుండా, కాబూల్‌పై జరిగిన వైమానిక దాడుల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

ఈరోజు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమైన అనంతరం ముత్తఖీ విలేకరులతో మాట్లాడారు. "గత నాలుగేళ్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను ఆఫ్ఘన్ గడ్డపై నుంచి పూర్తిగా ఏరివేశాం. ప్రస్తుతం దేశంలో ఒక్క ఉగ్రవాది కూడా లేడు. అంగుళం భూమి కూడా వారి ఆధీనంలో లేదు" అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి, "శాంతి కోసం మేం చేసినట్లుగానే ఇతర దేశాలు కూడా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలి" అని సూచించారు.

కాబూల్ పేలుళ్ల గురించి మాట్లాడుతూ... "ఇలాంటి చర్యల ద్వారా సమస్యలు పరిష్కారం కావు. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. వాళ్ల సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి. 40 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొంది. దీనితో ఎవరికీ ఇబ్బంది ఉండకూడదు" అని ముత్తాఖీ అన్నారు. ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించాలని ఎవరూ ప్రయత్నించవద్దని, అలా చేయాలనుకుంటే సోవియట్ యూనియన్, అమెరికా, నాటోలను అడిగి తెలుసుకోవాలని గట్టిగా హెచ్చరించారు.

మరోవైపు, భారత్‌తో సంబంధాలపై ముత్తాఖీ ప్రశంసలు కురిపించారు. ఆఫ్ఘనిస్థాన్‌తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని భారత్ నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాబూల్‌లోని భారత టెక్నికల్ మిషన్‌ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా అప్‌గ్రేడ్ చేస్తామని జైశంకర్ హామీ ఇచ్చారని తెలిపారు. భూకంపం సంభవించినప్పుడు మొదటగా స్పందించి ఆదుకున్నది భారతేనని గుర్తుచేసుకున్నారు. పరస్పర గౌరవం, వాణిజ్యం ఆధారంగా భారత్‌తో బలమైన స్నేహాన్ని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
Amir Khan Muttaqi
Afghanistan
Pakistan
India
S Jaishankar
Terrorism
Kabul
Lashkar-e-Taiba
Jaish-e-Mohammed
Diplomatic Relations

More Telugu News