కౌశిక్ అరెస్ట్ పై హరీశ్ స్పందన... కేటీఆర్ ను కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపాటు
- హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్
- ఇది కక్ష సాధింపు చర్యేనన్న మాజీ మంత్రి హరీష్‌రావు
- రేవంత్ సర్కార్‌పై హరీష్‌రావు తీవ్ర విమర్శలు
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుందని, నిద్రలో కూడా ఆయన పేరే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫార్ములా వన్ రేసును రాష్ట్రానికి తీసుకొచ్చిన కేటీఆర్‌ను కూడా ప్రస్తుత ప్రభుత్వం సతాస్తోందని మండిపడ్డారు. శని, ఆదివారాల్లో అరెస్టులు చేయవద్దని హైకోర్టు పలుమార్లు చెప్పినా, కౌశిక్‌రెడ్డి విషయంలో పోలీసులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం సీఎం కుర్చీ విలువను కూడా తీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.