దేశవ్యాప్తంగా రేపు మాక్ డ్రిల్.. ఏం చేస్తారంటే?
- పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు
- అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆర్డర్
- శత్రు దాడుల నుంచి పౌరుల రక్షణకు శిక్షణ, సన్నద్ధత ప్రధాన లక్ష్యం
- ఎయిర్ రైడ్ సైరన్లు, బ్లాక్అవుట్ చర్యలు, తరలింపు ప్రణాళికలపై డ్రిల్స్
మాక్ డ్రిల్ లో ఏంచేస్తారంటే..
శత్రు దేశాల నుంచి ఆకస్మిక దాడులు జరిగితే పౌరులు తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిందే ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్.. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. వైమానిక దాడి హెచ్చరిక సైరన్లను మోగించడం, భారత వైమానిక దళంతో హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలను క్రియాశీలం చేయడం, కంట్రోల్ రూమ్‌లు మరియు షాడో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించడం వంటివి ఇందులో ఉన్నాయి.
పౌరులు, విద్యార్థులకు ఆత్మరక్షణ పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేసే 'క్రాష్ బ్లాక్అవుట్' చర్యలు చేపట్టడం, కీలకమైన ప్లాంట్లు/సంస్థాపనలను శత్రువుల కంటపడకుండా మభ్యపెట్టడం (కామోఫ్లేజింగ్) వంటివి కూడా ఈ డ్రిల్స్‌లో భాగం. పౌర రక్షణ ప్రణాళికలు, తరలింపు ప్రణాళికలను ఆచరణలో పెట్టి పరీక్షించడం, బంకర్లు, కందకాలను శుభ్రపరచడం కూడా ఈ ప్రక్రియలో ఓ భాగమేనని అధికారులు తెలిపారు.