సింగర్ సోను నిగమ్ 'పహల్గామ్' వ్యాఖ్యలు.... ఎఫ్ఐఆర్ నమోదు
- ఇటీవల బెంగళూరులో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సంగీత కచేరి
- హాజరైన సింగర్ సోను నిగమ్
- కన్నడ పాట పాడాలని పదే పదే అరిచిన ఓ వ్యక్తి
- ఇలాంటి ప్రవర్తన వల్లే పహల్గామ్ దాడులు జరుగుతాయంటూ సోను అన్నట్టు ఆరోపణలు
ఈ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని, వారి భాషాభిమానాన్ని, సాంస్కృతిక గర్వాన్ని హింసతో పోల్చడం సరికాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ అనుకూల సంస్థ 'కర్ణాటక రక్షణ వేదిక' ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని అవలహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోను నిగమ్ వ్యాఖ్యలు వివిధ భాషా సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, హింసను ప్రేరేపించే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు సోను నిగమ్‌పై ఐపీసీలోని వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, పరువు నష్టం, మత/భాషా పరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి సెక్షన్ల కింద శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే, ఈ పరిణామాలపై సోను నిగమ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాను కన్నడ పాట పాడమని అడిగినందుకు కాదని, కొందరు వ్యక్తులు బెదిరింపు ధోరణితో ప్రవర్తించారని ఆరోపించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, పహల్గామ్ దాడిని ఉదాహరణగా చెప్పి, ప్రేమ ఉన్నచోట విద్వేషానికి తావులేదని చెప్పడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది.