ఆరేళ్లుగా ఆఫీసుకే పోలేదు, ఆఫీసర్లూ గుర్తించలేదు.. ఎలా పట్టుబడ్డాడంటే..?
- ఠంచనుగా జీతం తీసుకుంటున్నా ఆరేళ్లుగా అతడిని చూడలేదంటున్న సహోద్యోగులు
- 20 ఏళ్ల పాటు సేవలందించిన ఉద్యోగికి సన్మానం చేయాలని బాస్ నిర్ణయం
- ఏర్పాట్లు చేస్తుండగా బయటపడ్డ అసలు నిజం.. స్పెయిన్ లో ఘటన
స్పెయిన్ లోని కాడిజ్ మున్సిపల్ వాటర్ కంపెనీలో జోయక్విన్ గార్సియా ప్లాంట్ సూపర్ వైజర్ గా పనిచేశారు. 1990లో ఉద్యోగంలో చేరిన గార్సియా.. 2004 వరకు సక్రమంగా విధులు నిర్వహించాడు. వాటర్ ప్లాంట్ నిర్వహణ విషయంలో రెండు డిపార్ట్ మెంట్ ల మధ్య సమన్వయలోపం తలెత్తింది. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎవరికి వారు ఎదుటి డిపార్ట్ మెంట్ చూసుకుంటుందిలెమ్మని నిర్వహణను గాలికి వదిలేశారు. ఈ విషయం గమనించిన గార్సియా.. 2004 నుంచి విధులు ఎగ్గొడుతూ వచ్చాడు.
డ్యూటీకి వెళ్లకపోయినా ఎవరూ గుర్తించకపోవడంతో గార్సియా జీతం నెలనెలా అతడి బ్యాంకు ఖాతాలో పడింది. ఏడాదికి 41,500 డాలర్లు (మన రూపాయలలో 36 లక్షలు) అందుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఆరేళ్లపాటు నిరాటంకంగా సాగిన గార్సియా వ్యవహారం 2010లో బయటపడింది. ఇరవై ఏళ్ల పాటు సంస్థకు సేవలందించిన నేపథ్యంలో గార్సియాకు సన్మానం చేయాలని ఉన్నతాధికారులు ప్రయత్నించడంతో ఈ మోసం బయటపడింది. దీంతో గార్సియాపై కాడిజ్ వాటర్ కంపెనీ కోర్టుకెక్కగా.. ఇటీవల తీర్పు వెలువరించింది. గార్సియాకు 30 వేల డాలర్ల జరిమానా (మన రూపాయలలో 25 లక్షలు) విధిస్తూ తీర్పు చెప్పింది.