ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిపోవడంపై తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిపోవడంపై తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

Harish rao responds on SLBC tunnel accident
  • మొన్న సుంకిశాలలో రిటైనింగ్ వాల్, నేడు ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలాయన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ కమీషన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపాటు
  • ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని ఎద్దేవా
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు 'ఎక్స్' వేదికగా స్పందించారు. మొన్న సుంకిశాలలో రీటైనింగ్ వాల్, నేడు ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమీషన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్ధతకు, చేతగానితనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని ఎద్దేవా చేశారు. వరుస ఘటనలు కాంగ్రెస్ కమీషన్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.

ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని హరీశ్ రావు అన్నారు. గత నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతున్న విషయం తెలిసినప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనలో కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసిందని రాసుకొచ్చారు. మరికొంత మంది కార్మికులు లోపల ఉన్నట్లుగా తెలుస్తోందని, వారిని క్షేమంగా బయటకు తీసుకు వచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. వెంటనే డీ-వాటరింగ్ చేసి, విద్యుత్‌ను పునరుద్ధరించి, శిథిలాలను తొలగించి కార్మికులను వెంటనే బయటకు తీసుకు రావాలని హరీశ్ రావు అన్నారు. ఈ ప్రమాద ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ పనులు జరుగుతుండగా టన్నెల్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. ఎస్ఎల్‌బీసీ పనులు నాలుగు రోజుల క్రితమే పునఃప్రారంభమయ్యాయి.
Advertisement
Harish Rao
Congress
BRS
Revanth Reddy

More Telugu News