Congress: తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ ఓబీసీ నేత కీలక వ్యాఖ్యలు

Congress OBC leader on CM change in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఎలాంటి మార్పు ఉండదని, కానీ భవిష్యత్తులో తమ పార్టీ నుండి బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని ఏఐసీసీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు అజయ్ సింగ్ యాదవ్ అన్నారు. రాబోయే నాలుగేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, తెలంగాణకు మున్ముందు బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. భవిష్యత్తు అంతా బీసీలదే అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశంలోని అన్ని రాష్ట్రాలకు కనువిప్పు కలిగిస్తుందని ఆయన అన్నారు. బీసీలకు ఇదొక గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత స్థానాల్లో ఓబీసీలు లేరని, అన్ని పోస్టులలో కూడా అగ్ర కులాల వారే ఉన్నారని అన్నారు. దేశంలో 1 శాతం ఉన్న అగ్రకులాల చేతుల్లో 40 శాతం దేశ సంపద ఉందని ఆయన విమర్శించారు. అన్నింటా అన్ని కులాలకు సమ ప్రాధాన్యం దక్కాలని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 46 శాతం, మైనార్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలహీనుల వైపు నిలబడుతుందని ఆయన అన్నారు. తాము ఎప్పుడూ ఓబీసీలకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.
Go Back to Shorts
Congress
Telangana
Revanth Reddy

More Telugu News