Ramcharan: ఆ గొప్ప మల్లయోధుడితో రామ్‌చరణ్‌ సినిమాకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

Do you know what Ram Charans movie has to do with that great wrestler
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల రామ్‌చరణ్‌ నటించిన 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రం ఆయన అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విజయం సాధించకపోవడంతో ఈ కొణిదెల వారసుడు తన తదుపరి చిత్రంపై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఏఆర్. రెహమాన్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

ఇప్పటి వరకు దాదాపుగా 25 రోజుల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి దసరాకు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఇందుకోసం దర్శకుడు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. పీరియాడిక్‌ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూరల్‌ రూటెడ్‌ కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మల్లయోధుడుగా కనిపిస్తారని తెలిసింది.

ఇక, మనందరికి తెలిసిన తెలుగునేలకు చెందిన గొప్ప మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడుకు, ఈ సినిమా కథకు సంబంధం ఉందని సమాచారం. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కూడా కోడి రామ్మూర్తి నాయుడు ప్రేరణతో, ఆయన పుట్టిన ఊరు శ్రీకాకుళంలోని వీరఘట్టంలోనే పుట్టి ఆయన అడుగుజాడల్లోనే మల్లయోధుడుగా శిక్షణ పొంది, కుస్తీల పోటీలో భారతదేశం తరపున పాల్గొంటాడని తెలిసింది. ఈ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత ఫైట్‌మాస్టర్‌తో రూపొందిస్తున్నారట. 'పెద్ది' అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి దాదాపుగా ఇదే టైటిల్‌ను ఖరారు చేస్తారని అంటున్నారు. ఈ చిత్రం రామ్‌చరణ్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా ఉంటుందని, ఇందుకోసం సినిమా బృందం అంతా ఎంతో కృషి చేస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. 
Go Back to Shorts
Ramcharan
RC16
Buchibabu saana
Ram charan
Ram charan latest film
tollywood
Kodi rammurthy naidu

More Telugu News