ప్రముఖ సినీ నటుడు వేణు తొట్టెంపూడిపై హైదరాబాద్‌లో కేసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రముఖ సినీ నటుడు వేణు తొట్టెంపూడిపై హైదరాబాద్‌లో కేసు

Case filed against actor Venu Thottempudi in Hyderabad
  • మరో నలుగురిపైనా కేసు నమోదు
  • ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీపై రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎండీ గతంలో ఫిర్యాదు
  • తమతో చేసుకున్న ఒప్పందాన్ని సంస్థ ఉల్లంఘించిందని ఆరోపణ
  • నాంపల్లి కోర్టు ఆదేశాలతో తాజాగా కేసు నమోదు
ప్రముఖ సినీ నటుడు తొట్టెంపూడి వేణు సహా మరో నలుగురిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ సంస్థలో వేణు ప్రతినిధిగా ఉన్నారు. ఈ సంస్థ గతంలో ఉత్తరాఖండ్‌లో జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ద్వారా దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాయి. అయితే, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్యలోనే తప్పుకోవడంతో 2002లో రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టింది.

ఆ తర్వాత ప్రోగ్రెసివ్, టీహెచ్‌డీసీ మధ్య వివాదం తలెత్తి ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలో రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో ఆ సంస్థ ఎండీ రవికృష్ణ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. తాజాగా నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వేణుతోపాటు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకులు భాస్కరరావు హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, 'స్వయంవరం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వేణు ఆ తర్వాత కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన వేణు ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. 
Advertisement
Venu Thottempudi
Tollywood
CCS Police

More Telugu News