Mohan Babu: నా కులం వాళ్లను నా సినిమా చూడమంటే... ఒక్కడు కూడా చూడడు: మోహన్ బాబు

Mohan Babu emotional in MAA programme
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు నటుడిగా 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

తన తల్లిదండ్రుల ఆశీస్సులు, నటుడిగా తనకు జన్మనిచ్చిన దాసరి నారాయణరావు దీవెనలు తనపై ఎప్పుడూ ఉంటాయని మోహన్ బాబు తెలిపారు. ముఖ్యంగా అభిమానుల ప్రేమాభిమానాలు తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు.

జీవితంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని... భోజనం కూడా దొరకక ఇబ్బంది పడిన రోజులు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈరోజు 'మా' అసోసియేషన్ లో ఉన్న మీ అందరితో కలిసి భోజనం చేయాలనుకున్నానని... అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తన కుమారుడు విష్ణుని అడిగానని చెప్పారు. 

కులం కూడు పెట్టదని మోహన్ బాబు అన్నారు. తమ కులం వాళ్లను తన సినిమా చూడమంటే... ఒక్కడు కూడా చూడడని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. తనకు కులమతాలతో సంబంధం లేదని... అందరూ తనకు సమానమేనని చెప్పారు. అన్ని కులాలు ఒక్కటేనని అన్నారు. 

తాను ఎన్నో మంచి పనులు చేశానని... అయితే వేదికలపై వాటి గురించి చెప్పడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. ఎంతో మంది పిల్లలను తాను చదివించానని... చనిపోయిన ఒక నటుడి భార్యకు ఉద్యోగం ఇప్పించానని, వాళ్ల పిల్లలను చదివించానని, ఆ పిల్లలు కూడా హీరోలు అయ్యారని తెలిసి ఎంతో సంతోషించానని తెలిపారు. ఇలాంటి మంచి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటానని చెప్పారు. ఎవరికైనా చదువు విషయంలో ఇబ్బందులు ఉంటే తన యూనివర్శిటీ ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు.
Go Back to Shorts
Mohan Babu
Tollywood

More Telugu News