Kurnool District: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య .. జగన్ అండ్ కో తమ పంథాను మార్చుకోలేదంటూ లోకేశ్ ఆగ్రహం

TDP leader killed in Kurnool Lokesh warning YCP
షార్ట్స్‌లో చూడండి
కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన జరిగింది. బహిర్భూమికి వెళ్లిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులుపై దుండగులు కారం చల్లి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథాను మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.

వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
Go Back to Shorts
Kurnool District
Pattikonda
TDP
Crime News

More Telugu News