స్కిల్ యూనివర్సిటీపై కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy review on Skill University
  • ఢిల్లీ, హర్యానా తరహాలో స్కిల్ యూనివర్సిటీ ముసాయిదాను సిద్ధం చేసిన అధికారులు
  • ముసాయిదాలోని అంశాలపై పలు సూచనలు చేసిన సీఎం, డిప్యూటీ సీఎం
  • ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో అధికారులతో సమావేశమై స్కిల్ యూనివర్సిటీపై చర్చించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రొఫెసర్ కోదండరాం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ముసాయిదాపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.

ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముసాయిదాలోని అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. యూనివర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సులకు సంబంధించి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణం పైనా కీలక సూచనలు చేశారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించి... ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా ముందుకు సాగాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి నిధుల విషయంలో మాత్రం రాజీపడవద్దన్నారు. మార్పులు, చేర్పులతో పూర్తిస్థాయి ముసాయిదాను సిద్ధం చేయాలన్నారు.
Advertisement
Revanth Reddy
Mallu Bhatti Vikramarka
Congress
Telangana

More Telugu News