తెలంగాణ జెండా ఎత్తిన్నాడు కేసీఆర్‌ వెంట పిడికెడు మంది లేరు: హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ జెండా ఎత్తిన్నాడు కేసీఆర్‌ వెంట పిడికెడు మంది లేరు: హరీశ్ రావు

Harish Rao praises KCR
  • 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న బీఆర్ఎస్
  • ఆంధ్ర నాయకత్వాలను ఎదిరించి నిలబడ్డ నేత కేసీఆర్ అన్న హరీశ్
  • మరోసారి ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమయిందని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీ నేడు 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. మరోవైపు ఎక్స్ వేదికగా హరీశ్ రావు స్పందిస్తూ... తెలంగాణ జెండా ఎత్తిన రోజున కేసీఆర్ వెంట పిడికెడు మంది కూడా లేరని... కానీ కేసీఆర్ ఎత్తిన పిడికిలికి మూడున్నర కోట్ల పిడికిల్లు జతయ్యాయని చెప్పారు. 

"గులాబీ జెండాకు 24 ఏళ్ళు. భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు. ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం, ఉద్ధృతమై, ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసింది. తెలంగాణ జెండా ఎత్తిన రోజు కేసీఆర్‌ వెంట పిడికెడు మంది లేరు. ఊరూవాడను ఏకం చేసిండు. పల్లె గల్లీ తిరుగుతూ ప్రజల మనసులు గెలిచిండు. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేసి ప్రజలను చైతన్యపరిచిండు. 

అంగబలం, అర్ధబలం కలిగిన ఆంధ్ర నాయకత్వాలను ఎదిరించి నిలబడ్డాడు. తెలంగాణ వాదాన్ని అణచివేయజూసిన ప్రతిసారి, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసిండు. తన పదవులను గడ్డిపోచలుగా వదిలేసి ప్రజల్లో చర్చబెట్టి విజయాలు సాధించిండు. తెలంగాణ వాదాన్ని గెలిపించిండు. జల దృశ్యం నుండి జన దృశ్యంగా మారిన పరిణామంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అణచివేతలు, ఎన్నో అవమానాలు. 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కేసీఆర్ గారు ఎన్నడూ ఎత్తిన జెండాను దించలేదు. పట్టిన పట్టును విడవలేదు. 

‘ఈ బక్క మనిషితో అయితదా అన్నరు. ఈ జెండా ఉండేదా పోయేదా అన్నారు’. కానీ ఈ గులాబీ జెండానే గులాంగిరీని అంతం చేసి తెలంగాణను తెచ్చిపెట్టింది. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి, పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించింది. ఈ ఘనత ముమ్మాటికి గులాబీ జెండాదే. ఆత్మగౌరవంతో బతికే జాతి తెలంగాణ జాతి. ఆత్మగౌరవం దెబ్బ తిన్నప్పుడల్లా ధిక్కార స్వరమై నిలిచింది. కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. తెలంగాణకు నష్టం జరిగిన ప్రతిసారి బీఆర్ఎస్ గొంతెత్తి నినదించింది. ప్రజల పక్షాన పోరాటం చేసింది. ఇప్పుడు మరోసారి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమైంది" అని హరీశ్ ట్వీట్ చేశారు.
Advertisement
Harish Rao
KCR
BRS

More Telugu News