‘రాకెట్లు అంతరిక్షం వైపు పంపండి’.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య ఎలాన్ మస్క్ పోస్ట్
- ఇజ్రాయెల్–ఇరాన్ కు పరోక్షంగా ప్రపంచ కుబేరుడి శాంతి సందేశం
- ఇరాన్ ఎయిర్ పోర్ట్ పై ఇజ్రాయెల్ దాడి వార్తల నేపథ్యంలో తన ‘ఎక్స్’ ఖాతాలో కామెంట్
- గతేడాది ఇజ్రాయెల్ లో రెండు రోజులపాటు పర్యటించిన మస్క్
గతేడాది నవంబర్ లో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్ లో రెండు రోజులపాటు పర్యటించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి ప్రాంతాలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎలాన్ మస్క్ కు చూపించారు. అయితే ఈ పర్యటన తర్వాత ఆయన్ను గాజా సందర్శన కోసం హమాస్ ఆహ్వానించింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో తమ ప్రాంతం ఏ మేరకు ధ్వంసమైందో చూడాలని కోరింది. ఇజ్రాయెల్ పై గతేడాది అక్టోబర్ 7 దాడి తర్వాత గాజాపై ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. గత ఆరు నెలలుగా ఈ దాడి కొనసాగుతూనే ఉంది.
స్పేస్ ఎక్స్ కు చెందిన శాటిలైట్ నెట్ వర్క్ ‘స్టార్ లింక్’ ఇజ్రాయెల్ తోపాటు, గాజా స్ట్రిప్ లోని కొన్ని ప్రాంతాల్లో సేవలు అందించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో లైసెన్స్ పొందింది. గాజాలోని ఫీల్డ్ ఆస్పత్రిలో స్టార్ లింక్ సేవలు ఉపయోగించుకొనేందుకు ఆమోదముద్ర వేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే తమ ఇంటర్నెట్ సేవలను హమాస్ పొందకుండా నిరోధించేందుకు స్టార్ లింక్ అంగీకరించింది.