Rupert Murdoch: 92 ఏళ్ల వయసులో గాళ్ ఫ్రెండ్ కు రింగ్ తొడిగిన మీడియా కింగ్ రూపర్ట్ మర్డోక్

Rupert Murdoch set to ring the wedding bells for the fifth time
అంతర్జాతీయ మీడియా ప్రపంచం రారాజు రూపర్ట్ మర్డోక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జన్మతః ఆస్ట్రేలియా జాతీయుడు అయినప్పటికీ, అమెరికాలో స్థిరపడి మీడియా రంగంలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా వందలాది మీడియా సంస్థలను నడిపించిన వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు.

ది సన్, ది టైమ్స్, ది డైలీ టెలిగ్రాఫ్, హెరాల్డ్ సన్, ది ఆస్ట్రేలియన్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ పోస్ట్ వంటి ప్రముఖ దినపత్రికలతో పాటు, హార్పర్ కాలిన్స్ వంటి పుస్తక ప్రచురణ సంస్థ, స్కై న్యూస్ వంటి టీవీ చానళ్లకు ఆయన గతంలో అధిపతిగా ఉన్నారు. 

కొన్ని నెలల కిందటే ఫాక్స్ అండ్ న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో, 7 దశాబ్దాల పాటు మర్డోక్ ఏలిన మీడియా వ్యాపార సామ్రాజ్యం ముగిసినట్టయింది. 

ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం అమెరికా సంపన్నుల్లో మర్డోక్ స్థానం 31. అంతేకాదు, ప్రపంచ కుబేరుల్లో 71వ స్థానంలో ఉన్నారు. 2022 నాటికి ఆయన ఆస్తి విలువ రూ.1.73 లక్షల కోట్లు. 

ఇదంతా ఒకెత్తు... ఇప్పుడు చెప్పుకోబోయేది మరో ఎత్తు. రూపర్ట్ మర్డోక్ వయసు 92. సాధారణంగా ఈ వయసు వరకు చాలా కొద్దిమంది మాత్రమే జీవిస్తుంటారు. అది కూడా మునిమనవలతో కాలక్షేపం చేసే వయసు. కానీ మర్డోక్ ఈ వయసులో ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రేయసి ఎలెనా జుకోవాతో నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరి పెళ్లి కాలిఫోర్నియాలోని మొరాగా ప్రాంతంలో మర్డోక్ కు చెందిన వైన్ యార్డ్ లో జరగనుందట. 

అన్నట్టు... మర్డోక్ పెళ్లాడబోయే నవ వధువు ఎలెనా జుకోవా వయసు 67 సంవత్సరాలు. అది కూడా మర్డోక్ మూడో భార్య వెండీ డెంగ్ ద్వారా జుకోవా పరిచయం అయిందట. జుకోవా ఓ రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. ఆమె స్వస్థలం రష్యాలోని మాస్కో నగరం. 

మర్డోక్ నాలుగో పెళ్లి 2022లో పెటాకులైంది. హాలీవుడ్ నటి, మోడల్ కు జెర్రీ హాల్ తో ఆరేళ్ల వైవాహిక జీవితం అనంతరం మర్డోక్ ఆమెకు విడాకులు ఇచ్చారు. మర్డోక్ గతేడాది శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ అధికారిణి చాప్లెయిన్ ఆన్ లెస్లీ  స్మిత్ ను పెళ్లాడాల్సి ఉండగా, వారి నిశ్చితార్థం రద్దయింది.

ఇక, మర్డోక్ ఇప్పుడు పెళ్లాడబోయే జుకోవా బ్యాక్ గ్రౌండ్ కూడా ఘనంగా ఉంది. ఆమె రష్యా రాజకీయ నేత, వ్యాపారవేత్త రోమన్ అబ్రమోవిచ్ కు స్వయానా పిల్లనిచ్చిన అత్తగారు. అబ్రమోవిచ్ రష్యాలోని శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఫుట్ బాల్ క్లబ్ చెల్సియాకు ఆయన గతంలో  యజమాని. అయితే, ఎలెనా జుకోవా కుమార్తె దాషా జుకోవాను 2008లో పెళ్లాడిన అబ్రమోవిచ్ ఆమెకు 2017లో విడాకులిచ్చేశారు.
Rupert Murdoch
Wedding
Elena Zhukova
Media Moghul

More Telugu News