రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇక రోజంతా కళకళే!

రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇక రోజంతా కళకళే!

Shops to remain open 24 hours a day in 7 days in a week in Telangana
  • ఉద్యోగులకు ఐడీకార్డులు, వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే
  • షిఫ్ట్‌కు మించి పనిచేస్తే అదనపు వేతనం  
  • మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిందేనన్న ప్రభుత్వం
  • రోజంతా తెరిచి ఉంచే షాపులు వార్షిక రుసుముగా రూ. 10 వేలు చెల్లించాలని జీవో
రాష్ట్రంలోని వ్యాపారులు, దుకాణదారులు, షాపింగ్స్ మాల్స్, రెస్టారెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వాటిని వారంలో ఏడు రోజులూ 24 గంటలూ తెరిచి ఉంచుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన జీవోను కార్మికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ రాణి కుముదిని ఈ నెల 4నే విడుదల చేయగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 

తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1988 కింద పేర్కొన్న దుకాణాలు, సంస్థలకు సెక్షన్ 7 (దుకాణాలు తెరవడం, మూసివేసే గంటలు) నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఇందుకు సంబంధించి కొన్ని షరతులను కూడా విధించింది. ఆయా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, దుకాణదారులు తమ ఉద్యోగులకు ఐడీ కార్డులు ఇవ్వాలి. వారాంతపు సెలవులు ఇవ్వడంతోపాటు వారానికి వారి పనిగంటలను నిర్దేశించాలి. షిఫ్ట్‌కు మించి పనిచేస్తే ఎన్ని గంటలు పనిచేసిందీ లెక్కగట్టి అదనపు వేతనం చెల్లించాలి.

ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేస్తే అందుకు సంబంధించిన వేతనం ఇవ్వాల్సి వస్తుంది. మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగుల నుంచి ముందుగానే వారి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది. వారి రాకపోకలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆయా షాపులు కచ్చితమైన రికార్డులు నిర్వహించాలి. ఆదాయపన్నును సకాలంలో చెల్లించాలి. 24 గంటలూ తెరిచి ఉంచే షాపులు వార్షిక రుసుముగా రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, పోలీసు యాక్ట్, రూల్స్‌ను అంగీకరిస్తేనే షాపులు 24 గంటలూ నిర్వహించుకునేందుకు అనుమతి లభిస్తుంది.
Advertisement
Telangana
Shops
Shopping Malls
Business

More Telugu News