Tollywood: హృతిక్​ రోషన్ ​తో బాలీవుడ్​ లో ‘వార్’​ చేయనున్న ఎన్టీఆర్​

  • తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు
  • వార్2లో హృతిక్ తో కలిసి నటించనున్న యంగ్ టైగర్
  • ఆర్ఆర్ఆర్ తర్వాత దేశమంతంటా మార్మోగుతున్న తారక్ పేరు
HRITHIK and JR NTR IN WAR 2

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారత్ తో పాటు వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలైన ఏడాది తర్వాత ఈ మధ్యే తన తదుపరి సినిమాను ఆయన మొదలు పెట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’ సినిమా ప్రారంభమైంది. దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. 

ఇదిలా ఉండగా.. మరోపక్క ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమైంది. బాలీవుడ్‌ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘వార్ 2’ని ప్రకటించారు. ఈ సీక్వెల్‌లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ చేయబోతున్నట్టు బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

‘వార్’ మొదటి భాగాన్ని సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించగా ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. అయాన్ ముఖర్జీ ఈ మధ్యే ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో దేశ  వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ లో ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రం గురించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News