Balakrishna: అక్కినేనిపై వ్యాఖ్యల పట్ల తొలిసారిగా స్పందించిన బాలకృష్ణ

Balakrishna reacts criticism over his comments on Akkineni
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల వీరసింహారెడ్డి చిత్రం విజయోత్సవ సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పట్ల నందమూరి బాలకృష్ణ తొలిసారిగా స్పందించారు. ఆ రంగారావు ఈ రంగారావు... ఆ అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ కుటుంబంతో తమ అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో, బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, తాను ఏదో ఫ్లోలో అన్న మాటలకు రాద్ధాంతం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అక్కినేని నాగేశ్వరరావును తాను బాబాయ్ గా భావిస్తానని వెల్లడించారు. 

ఆయన తన పిల్లల కంటే నన్ను ఎక్కువగా ప్రేమగా చూసుకునేవారు... నన్ను చాలా ఇష్టంగా చూసుకునేవారు... ఎందుకంటే అక్కడ ఆప్యాయత లేదు... ఇక్కడ ఉంది అని బాలయ్య వెల్లడించారు. బాబాయ్ పట్ల నా గుండెల్లో ప్రేమ ఉంది... బయట ఏవో అంటుంటారు... అవన్నీ నేను పట్టించుకోను అని స్పష్టం చేశారు. 

"ఎన్టీఆర్, ఏఎన్నార్ లను అభిమానంతో ఎలా పిలుస్తారో తెలిసిందే కదా... రామారావును అభిమానంతో ఎన్టీవోడు అంటారు. ఏఎన్నార్ ను నాగిగాడు అంటారా లేదా...! అభిమానంతోనే అలా అంటారు. నేను ప్రచారానికి వెళ్లినప్పుడు నాకు కూడా ఇలాంటి మాటలు ఎదురవుతుంటాయి. వాళ్ల యాసలో ఏదో ఒక పదం జోడించి.... వెళ్లిపోతున్నాడ్రా అని అంటారు. అది వాళ్ల అభిమానం! మనకు ఆప్తులైన వాళ్ల గురించి మనం కూడా అభిమానంతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. ఒక్కోసారి మనం తాడో పేడో అని అంటుంటాం... అందులో పేడు అంటే అర్థం ఏంటి? ఏవో మాటలు కొన్నిసార్లు అలా వచ్చేస్తాయి. వాటిని తప్పుపడితే ఎలా? ప్రేమకొద్దీ అన్న మాటలను కూడా దుష్ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు" అని బాలకృష్ణ వివరించారు.
Go Back to Shorts
Balakrishna
Akkineni
SV Rangarao
Tollywood
TDP

More Telugu News