జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం
- కంబోడియా ప్రధాని హున్ సేన్ కు కరోనా నిర్ధారణ
- తన సమావేశాలను రద్దు చేసుకొని కంబోడియా తిరుగు పయనం
- మొన్న ముగిసిన ఆసియాన్ సదస్సులో బైడెన్, భారత ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌కడ్ ను కలిసిన హున్ సేన్
ఆదివారం ముగిసిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి కంబోడియా ఆతిథ్యం ఇచ్చింది. సేన్ చాలా మంది నాయకులతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. అనంతరం సోమవారం రాత్రి బాలి చేరుకున్నారు. ఆ రాత్రి ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. ఇందులో ఆయన పాజిటివ్ గా తేలారు. ఈ విషయాన్ని ఇండోనేషియా వైద్యులు ధ్రువీకరించారు. దాంతో, తాను కంబోడియాకు తిరిగి వస్తున్నానని, జీ 20తో పాటు బ్యాంకాక్‌లో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఫోరమ్‌లో తన సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్లు హున్ సేన్ తెలిపారు.
తాను సోమవారం ఆలస్యంగా బాలి చేరుకోవడం అదృష్టమని అన్నారు. ముందే వచ్చి ఉంటే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇతర నేతలతో కలిసి విందులో పాల్గొనేవాడినని చెప్పారు. తనకు కరోనా ఎలా సోకిందో తెలియదన్నారు. కాగా, బాలిలో మంగళ, బుధవారాల్లో జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 20 దేశాల నేతలు ఇందులో పాల్గొంటున్నారు.