ఓ మహిళ పిల్లలు కనాలా? వద్దా? అనే హక్కుకు పరిమితులు విధించలేరు: కేరళ హైకోర్టు

Kerala high court comments on woman petition to remove her pregnancy
  • కోర్టును ఆశ్రయించిన యువతి
  • 26 వారాల గర్భం తొలగించుకోవడానికి అనుమతి కోరిన వైనం
  • పిటిషన్ పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు
పిల్లలు కనాలా? వద్దా? అనేది మహిళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని కేరళ హైకోర్టు పేర్కొంది. ఆరోగ్యపరమైన కారణాలతో 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ 23 ఏళ్ల యువతి హైకోర్టును ఆశ్రయించింది. 

ఆమె ఎంబీఏ విద్యార్థిని. తన సహ విద్యార్థితో శారీరక సంబంధం కారణంగా గర్భం దాల్చింది. తాను గర్భవతినన్న విషయం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా వెల్లడైందని, పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ తో బాధపడుతున్నందున గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని ఆమె కోర్టును కోరింది. 

అంతేకాదు, తన భాగస్వామి పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయాడని, గర్భంతో ఎంతో ఆందోళనకు గురవుతున్నానని, చదువుపైనా దృష్టి నిలపలేకున్నానని వివరించింది. అంతేకాదు, ఏదైనా ఉద్యోగం చేయడానికైనా గర్భం ఇబ్బందికరంగా మారిందని పేర్కొంది. 

ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళ సంతానోత్పత్తికి సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కును ఎవరూ తోసిపుచ్చలేరని స్పష్టం చేసింది. పిల్లలు కనాలా, వద్దా అనేదానిపై మహిళకు పరిమితులు విధించలేరని వ్యాఖ్యానించింది. సంతానోత్పత్తికి మొగ్గు చూపినా, సంతానోత్పత్తికి దూరంగా ఉండాలని భావించినా, అది పూర్తిగా మహిళ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. 

మహిళ పునరుత్పత్తికి సంబంధించిన స్వేచ్ఛ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తుందని కేరళ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇదే అంశంలో గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని ప్రస్తావించింది.
Go Back to Shorts
Kerala High Court
Woman
Pregnancy
Liberty

More Telugu News