రామన్ మెగసెసే పురస్కారాన్ని తిరస్కరించిన కేరళ మాజీ మంత్రి కేకే శైలజ
- ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట అవార్డు
- మెగసెసేపై కమ్యూనిస్టు వ్యతిరేకి అన్న ముద్ర
- అవార్డుపై సీపీఎం కేంద్ర కమిటీతో చర్చించిన శైలజ
- అవార్డు తీసుకోరాదని నిర్ణయం
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసేకు కమ్యూనిస్టులను ఉక్కుపాదంతో అణచివేశాడన్న చరిత్ర ఉంది. అందుకే తాను ఆయన పేరిట ఏర్పాటు చేసిన అవార్డును స్వీకరించడంలేదని కేకే శైలజ వెల్లడించారు. ఈ పురస్కారంపై వ్యక్తిగతంగా తనకేమంత ఆసక్తి లేదని అన్నారు.
కేకే శైలజ నిర్ణయాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమర్థించారు. ఫిలిప్పీన్స్ లో కమ్యూనిస్టుల పట్ల దారుణంగా వ్యవహరించిన చరిత్ర రామన్ మెగసెసేదని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేకే శైలజ రామన్ మెగసెసే అవార్డును మర్యాదపూర్వకంగా తిరస్కరించారని సీతారాం ఏచూరి వెల్లడించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలైన కేకే శైలజ.... పార్టీ అధినాయకత్వంతో చర్చించిన తర్వాతే ఈ అవార్డును తీసుకోరాదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.