రూ.30 వేల బాకీ కోసం మాజీ బాయ్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసిన టీనేజి అమ్మాయి

Teenage girl kidnaps ex boyfriend
  • విభేదాలతో విడిపోయిన జంట
  • మరో ప్రియుడ్ని చూసుకున్న అమ్మాయి
  • మాజీ ప్రియుడిపై పగ
  • కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
కోల్ కతాలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. మాజీ బాయ్ ఫ్రెండ్ తన బాకీ చెల్లించలేదంటూ ఓ టీనేజి అమ్మాయి ఏకంగా అతడిని కిడ్నాప్ చేయించింది.  బెలియాఘటా ప్రాంతానికి చెందిన తమల్ అధికారి (22), కెస్తోపూర్ కు చెందిన ఆ టీనేజి అమ్మాయి (18) కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. వారిద్దరూ సఖ్యతతో ఉన్న సమయంలో తమల్ అధికారికి ఆమె రూ.30 వేలు ఇచ్చింది. ఆ డబ్బు చేతిలో పడిన తర్వాత అతడు తనను పట్టించుకోవడం మానేశాడని ఆమె ఆగ్రహంతో ఉంది. 

ప్రస్తుతం మరో యువకుడితో ప్రేమలో ఉన్న ఆ యువతి ఎలాగైనా మాజీ ప్రియుడి నుంచి ఆ బాకీ వసూలు చేయాలని నిర్ణయించుకుంది. "నిన్ను ఓసారి కలవాలని ఉంది" అంటూ తమల్ అధికారికి రాయబారం పంపింది. నిజమేనని నమ్మి వచ్చిన ఆ యువకుడిని తన ప్రస్తుత బాయ్ ఫ్రెండ్, అతడి స్నేహితుల సాయంతో కిడ్నాప్ చేసింది. భవానీపూర్ లేడీస్ పార్క్ సమీపంలోని ఓ గదిలో బంధించింది. తమల్ తండ్రి తపన్ (52)కు ఫోన్ చేసి డబ్బు తెస్తేనే అతడి కుమారుడ్ని వదిలిపెడతానని స్పష్టం చేసింది. 

మొదట లక్ష రూపాయలు డిమాండ్ చేసిన ఆ యువతి, చివరికి రూ.30 వేలు ఇస్తే చాలంది. అయితే, కిడ్నాప్ కు గురైన యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ 18 ఏళ్ల యువతిని, ఆమె ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ ని, అతడి ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారి బారి నుంచి తమల్ అధికారిని కాపాడారు.
Go Back to Shorts
Teenage Girl
Ex Boyfriend
Kidnap
Kolkata
Police
West Bengal

More Telugu News