ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ పొరబాటు చేయొద్దు... వారిని విధుల్లోకి తీసుకుంటున్నాం: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

CM KCR tells govt has taken Field  Assistants into jobs again
  • ఫీల్డ్ అసిస్టెంట్లకు కేసీఆర్ తియ్యని కబురు
  • ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వెల్లడి
  • రెండేళ్ల కిందట తొలగింపుకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్లు
రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం వేల సంఖ్యలో ఉపాధి హామీ పథకంకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం తెలిసిందే. బకాయిల చెల్లింపు, వేతనాల పెంపు, జీవో నెం.4779 రద్దు చేయాలన్న డిమాండ్లతో నాడు ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేశారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వారిని తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. దాదాపు 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు వేసినట్టు తెలుస్తోంది.

అప్పటినుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కొన్ని రోజుల కిందట కూడా తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు మరోసారి పొరపాటు చేయొద్దని హితవు పలికారు.

సెర్ప్ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన విషయం తెలిపారు.

కాగా, తెలంగాణలో తొలగింపునకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుగా నిలిచింది. 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆప్ కేంద్రాన్ని కోరింది. ఆప్ దక్షిణాది విభాగం ఇన్చార్జి సోమ్ నాథ్ భారతి నిన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సింహాను కలిసి విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
CM KCR
Field Assistants
Jobs
Telangana

More Telugu News