డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లోనూ మందుబాబులకు ఊరట.. జరిమానాల్లో భారీ రాయితీ
- ఈ నెల 12తో ముగియనున్న లోక్ అదాలత్
- డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జైలు శిక్ష లేనట్టే
- జరిమానాలతోనే సరి
- లోక్ అదాలత్ ముగిశాక మళ్లీ మామూలే
నిజానికి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి వాహనాలు వదిలేసుకున్నచాలామంది జైలు శిక్షపడుతుందేమోనన్న ఉద్దేశంతో పోలీసులను, కోర్టులను సంప్రదించడం మానేశారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారు రూ. 10 వేలకు పైగా జరిమానా చెల్లించాల్సి రావడంతో పాత వాహనాలను వదిలేసుకోవడమే మేలని భావించి అటువైపు చూడడం మానేశారు. అలాంటి వారికిది శుభవార్తే. జైలు శిక్ష లేకుండా చేయడంతోపాటు జరిమానాలను కూడా తగ్గించడంతో అలాంటి వారంతా ముందుకొస్తారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
రాయితీల విషయంలో బైక్‌లు, కార్లు, హెవీ వెయిట్ వాహనాలకు వేర్వేరుగా జరిమానాలు విధించగా, రాయితీలు కూడా అందుకు అనుగుణంగానే ప్రకటించారు. అయితే, రాయితీ చెల్లించిన తర్వాత కూడా మరోమారు పట్టుబడితే మాత్రం జరిమానాను రెండింతలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయితీలతో కూడిన లోక్ అదాలత్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ నెల 12న ముగుస్తుందని, ఆలోగా పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకోవాలని కోరుతున్నారు. అయితే, గడువు ముగిసిన తర్వాత మాత్రం పాత జరిమానాలే కొనసాగుతాయని తెలిపారు.