ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల నిర్వాహకుడి అకృత్యం.. ఆహారంలో మత్తుమందు కలిపి 17 మంది విద్యార్థినులపై అత్యాచారం

08-12-2021 Wed 07:04
  • ప్రాక్టికల్ పరీక్షల కోసం మరో స్కూలుకు తీసుకెళ్లిన నిర్వాహకుడు
  • రాత్రికి అక్కడే బస ఏర్పాటు
  • సహాయకుడితో కలిపి అత్యాచారం
  • తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్
17 girl students drugged molested by 2 school managers in Uttar pradesh
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా పుర్కాజి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడు అకృత్యానికి తెగబడ్డాడు. ఆహారంలో మత్తుమందు కలిపి 17 మంది పదో తరగతి విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రాక్టికల్ పరీక్షల నిమిత్తం విద్యార్థినులను మరో స్కూలుకు తీసుకెళ్లిన నిందితుడు ఆలస్యమవుతుందన్న కారణం చెప్పి ఆ రాత్రికి అక్కడే బస ఏర్పాటు చేయించాడు.

అనంతరం వారికి అందించిన ఆహారంలో మత్తుమందు కలిపాడు. వారు సృహ కోల్పోయిన తర్వాత పాఠశాల నిర్వాహకుడు, అతడి సహాయకుడు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన తర్వాత భయపడిపోయిన విద్యార్థినులు పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. వారు చెప్పింది విని విస్తుపోయారు. అలా 17 రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

స్థానిక ఎమ్మెల్యే సహకారంతో బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడైన పాఠశాల నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సహాయకుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చర్యలు చేపట్టింది. కేసు వివరాలను తమకు నివేదించాలని ముజఫర్‌నగర్ కలెక్టర్‌ను ఆదేశించింది.