సోనూసూద్ సేవలు చేస్తోంటే ఆయనను భయపెట్టడానికి ప్రయత్నించారు: కేటీఆర్
- ఐటీ, ఈడీతో సోదాలు చేయించారు
- సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదు
- ఆయన వెంట మేమంతా ఉన్నాం
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... సమాజంలో సవాళ్లు ఎదురైనప్పుడు ప్రభుత్వం మాత్రమే అన్ని పనులూ చేయడం సాధ్యం కాదని చెప్పారు. సోషల్ మీడియాలో విమర్శలు చేయడం చాలా తేలికేనని చెప్పారు. అయితే, బాధ్యతగా సేవలు చేయడం గొప్ప అని ఆయన అన్నారు.
సోనూసూద్ పేద ప్రజలకు సేవలు చేస్తోంటే ఆయన ఇళ్లు కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడులు చేయించి, ఆయనను భయపెట్టాలని అనుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆయనకు సమాజంలో ఉన్న ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నం చేశారని అన్నారు. సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆయన వెంట తామంతా ఉన్నామని తెలిపారు.
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. నేతలు అందరూ కేటీఆర్ లా ఉంటే తనలాంటి వారి అవసరం సమాజానికి ఉండదని కొనియాడారు. కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారని ఆయన చెప్పారు. తాను దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేశానని వివరించారు.