ఎర్రబెల్లిని దాదాపు అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక చుక్కలు చూపించారు: విజయశాంతి

Vijayashanthi comments on Errabelli
  • ఎర్రబెల్లిని ఉపాధిహామీ అసిస్టెంట్లు నిలదీశారు
  • పిల్లలకు తిండి కూడా పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు
  • టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు
వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని దాదాపు అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చుక్కలు చూపించారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. తమ ఉద్యోగాల పేరులో మాత్రమే "ఉపాధి హామీ" ఉంది తప్ప... విధుల‌కు తమను దూరం పెట్టి పగ సాధిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుతో... కరోనా కష్టకాలంలో పనిలేక, జీతం రాక త‌మ కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయ‌ని రోదిస్తూ శాపనార్థాలు పెట్టారని తెలిపారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని మండిప‌డ్డారని, పిల్లలకు సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నామని మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లు మీడియా ముందు తీవ్ర వేదనకు గురయ్యారని ఆమె అన్నారు.

తన కళ్ళముందే ఇంత జరుగుతున్నా వారి సమస్యను తాను పరిశీలిస్తానని గాని, సీఎం దృష్టికి తీసుకెళతానని గాని కనీస హామీ ఇచ్చేందుకు కూడా ఆ మంత్రిగారు ధైర్యం చెయ్యలేని దుస్థితి కనిపించిందని విజయశాంతి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కుటుంబాలు తప్ప ఒక్క వర్గం కూడా సంతృప్తిగా బతుకుతున్న దాఖలా లేదని మండిపడ్డారు. పంటల కొనుగోళ్ళు లేక రైతులు... ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్యల బాటలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అనే పరిస్థితి నెలకొందని విజయశాంతి వ్యాఖ్యానించారు. అధికార పార్టీని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా... అని ప్రజలు ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదని అన్నారు.
Go Back to Shorts
Vijayashanti
BJP
Errabelli
TRS

More Telugu News