అమెరికాలో ప్రతి ఇద్దరు ఇండియన్ అమెరికన్లలో ఒకరిపై వివక్ష: తేల్చిన సర్వే
- తోటి భారతీయ మూలాలున్న వారితోనే వివాహాలు
- 3 అమెరికా యూనివర్సిటీలు కలిసి సర్వే
- అమెరికన్ భారతీయుల సామాజిక స్థితిగతులపై నివేదిక
ఆన్ లైన్ లో 1,200 మంది ఇండియన్ అమెరికన్ల అభిప్రాయాలను అధ్యయనకారులు తీసుకున్నారు. ఆ సర్వేకి సంబంధించి బుధవారం ‘భారతీయ అమెరికన్ల సామాజిక స్థితిగతులు’ పేరిట నివేదికను విడుదల చేశారు. ఏడాది కాలంగా అమెరికాలోని సగం మంది ఇండియన్ అమెరికన్లు వివక్షను ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. ఆశ్చర్యకరంగా అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్లపైనే ఎక్కువ వివక్ష ఉంటోందని పరిశోధకులు గుర్తించారు.
ప్రతి పది మంది ఇండియన్ అమెరికన్లలో 8 మంది.. తోటి భారతీయ మూలాలున్న వారినే పెళ్లి చేసుకుంటున్నారని తేలింది. సర్వేలో పాల్గొన్న మూడొంతుల మంది తమ జీవితాల్లో మతం చాలా కీలకమైందని తేల్చి చెప్పారు. హిందువుల్లో సగం మంది పేరుకు కులాన్ని కచ్చితంగా తగిలించుకుంటున్నారని గుర్తించారు.
అమెరికాలోని భారతీయ మూలాలున్న వారిని ఇండియన్ అమెరికన్లు అని పిలుస్తున్నా.. అలా పిలవడం ఇష్టం లేదని 60 శాతం మంది పేర్కొన్నారు. కాగా, 2018 గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రస్తుతం 42 లక్షల మందికిపైగా భారతీయ మూలాలున్న వారు నివసిస్తున్నారు.