అమిత్‌షాతో జగన్ గంటపాటు భేటీ.. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమిత్‌షాతో జగన్ గంటపాటు భేటీ.. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థన

AP CM YS Jagan met Amit Shah in Delhi
  • రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చ
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అభ్యర్థన
  • కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు విడుదల చేయాలన్న జగన్
  • కర్నూలుకు హైకోర్టుపై బీజేపీ మేనిఫెస్టోను గుర్తు చేసిన సీఎం
నిన్న సాయంత్రం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాత్రి 8.34 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు విషయాలను జగన్‌మోహన్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగానే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, విశాఖపట్టణం, అమరావతి, కర్నూలును పరిపాలన, శాసన, న్యాయ రాజధానులుగా చేస్తూ చట్టం చేసినట్టు కేంద్రమంత్రికి జగన్ వివరించారు. హైకోర్టును కర్నూలుకు తరలించాల్సిన ప్రక్రియను ప్రారంభించాల్సి ఉందని, ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. గత ఎన్నికల సమయంలో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని జగన్ ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 55,656 కోట్లకు పెంచాలని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, కరోనా నేపథ్యంలో అదనంగా రుణాలు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని, 2013-14 నుంచి 2018-19 మధ్య కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టిన బియ్యం పంపిణీకి కేంద్రం నుంచి రాయితీ రూపంలో రావాల్సిన రూ. 1,600 కోట్లను వెంటనే విడుదల చేయాలని, జీఎస్టీ బకాయిలు, రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 16 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. షాతో భేటీ ముగిసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ రూపాల్లో కేంద్రం నుంచి ఏపీకి రూ. 14,555.07 కోట్లు రావాల్సి ఉన్నట్టు సీఎం తన వినతి పత్రంలో ప్రస్తావించినట్టు అందులో పేర్కొంది.
YS Jagan
Andhra Pradesh
Amit Shah

More Telugu News