తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ.. మాస్క్ లేకుండా వస్తే రూ. వెయ్యి జరిమానా!
Add ap7am to your home Screen

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ.. మాస్క్ లేకుండా వస్తే రూ. వెయ్యి జరిమానా!

Lockdown Extended in Telangana
  • రాష్ట్రంలో నిన్నటితో ముగిసిన లాక్‌డౌన్ గడువు
  • 29 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు
  • రాష్ట్రమంతటా కొన్నింటికి అనుమతి
తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నిన్నటితో లాక్‌డౌన్ గడువు ముగియడంతో దానిని ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా నిత్యావసర, ఇతర దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా తప్పదని ఉత్తర్వుల్లో హెచ్చరించింది.

సడలింపుల్లో భాగంగా నిత్యావసర వస్తువులు, ఉత్పత్తి, విత్తనాలు, ఎరువులు సహా వ్యవసాయ సంబంధ దుకాణాలు వంటి వాటికి అనుమతి ఇచ్చింది. అలాగే, రాష్ట్రం లోపల వస్తువుల రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధి హామీ పనులు, ఆసుపత్రులు, మందుల దుకాణాలు, క్లినిక్‌లు, టెలికం, ఇంటర్నెట్, పెట్రోలు పంపులు, పోస్టల్, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, బ్యాంకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సేవలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు (శ్రామిక్ రైళ్ల మినహాయింపు), అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తుల రాకపోకలు(అనుమతి పొందినవారికి మినహాయింపు), మెట్రో రైళ్లు, పాఠశాలలు, శిక్షణ సంస్థలు, హోటళ్లు, లాడ్జీలు, బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్ మాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, సామూహికంగా మతపరమైన కార్యక్రమాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు వంటి వాటికి జోన్లతో సంబంధం లేకుండా అన్నింటిని నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Telangana
Lockdown
KCR
Corona Virus

More Telugu News