తిరుచ్చిలో బీజేపీ నేత దారుణ హత్య.. వెంటాడి మరీ నరికి చంపిన దుండగులు!

  • తప్పించుకుని పరిగెడుతుంటే వెంటపడి నరికిన వైనం
  • హతుడు బీజేపీ జోనల్ కార్యదర్శి
  • పాతకక్షలే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
టీ తాగేందుకు మార్కెట్‌కు వెళ్లిన బీజేపీ నేత ఒకరు ఓ ముఠా చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు ఆయన పరుగులు పెట్టినప్పటికీ వెంటాడి మరీ వేటకొడవళ్లతో నరికి చంపారు. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తిరుచ్చి పాలకరై ప్రాంతానికి చెందిన విజయరఘు (40) బీజేపీ జోనల్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానిక గాంధీ మార్కెట్లో ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు టోకెన్లు కూడా ఇస్తూ ఉంటారు.

నిన్న తెల్లవారుజామున టీ తాగేందుకు మార్కెట్‌కు వెళ్లిన ఆయనపై ఐదుగురు సభ్యుల ముఠా వేటకొడవళ్లు, కత్తులతో దాడిచేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రఘు వారి నుంచి తప్పించుకుని పరుగులు తీశారు. అయినప్పటికీ వదలని హంతకులు వెంటాడి మరీ దాడిచేశారు. విచక్షణ రహితంగా నరికారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని పోలీసులు వెంటనే తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత కాసేపటికే ఆయన ప్రాణాలు విడిచారు.

విజయరఘు హత్య విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని అక్కడే రాస్తారోకో చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రఘు హత్య వెనక లాటరీ వ్యాపారి మహ్మద్ బాబు అలియాస్ మిఠాయి బాబు ఉన్నట్టు ఆరోపించారు. వారిద్దరి మధ్య పాతకక్షలు ఉన్నాయని, గతేడాది ఓ సెల్‌ఫోన్ చోరీ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపారు.

రఘు, ఆయన బావమరిదిపై హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన మహ్మద్ బాబు ఈ నెల 11న బెయిలుపై విడుదలయ్యాడు. అంతలోనే రఘు హత్యకు గురికావడంతో అతడిపై పోలీసుల అనుమానం మరింత బలపడింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Tiruchirappalli
BJP
Murder
Tamil Nadu

More Telugu News