పరువు తీస్తానని బెదిరించి మహిళా కాంపౌండర్ పై డాక్టర్ అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన కెమిస్ట్!
- మహారాష్ట్రలోని కల్యాణ్ లో దారుణం
- కొన్ని నెలలుగా యువతిపై అత్యాచారం
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కల్యాణ్ ప్రాంతంలో అన్సారీ అనే డాక్టర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. అక్కడే దిల్షాద్ షేక్ అనే కెమిస్ట్ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ షాపును నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో కాంపౌండర్ గా చేరిన ఓ మైనర్ యువతిపై అన్సారీ కన్నేశాడు. తన కోరిక తీర్చాలని వేధించాడు. అయితే బాధితురాలు ఇందుకు తిరస్కరించడంతో ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించాడు. తన కుటుంబం తన సంపాదనపైనే ఆధారపడి ఉండడంతో ఉద్యోగం పోతుందన్న భయంతో యువతి మౌనంగా ఉండి డాక్టర్ కి లొంగిపోయింది.
ఈ సందర్భంగా యువతిపై డాక్టర్ అన్సారీ లైంగికదాడి చేస్తుండగా, మెడికల్ షాపు ఓనర్ దిల్షాద్ వీడియో తీశాడు. తన మాట వినకుంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తానని బెదిరిస్తూ దిల్షాద్ కూడా ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా కుంగిపోయింది. చివరికి వీరిద్దరి వేధింపులు శ్రుతి మించడంతో తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి, పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్సారీని అరెస్ట్ చేశారు. అతనిపై రేప్ కేసు నమోదు చేశారు. మరోవైపు పరారీలో ఉన్న దిల్షాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.