నా ఫ్రెండ్ చంద్రబాబునాయుడికి వందశాతం 'రిటర్న్ గిఫ్ట్' ఇస్తా: సీఎం కేసీఆర్ సెటైర్
- చంద్రబాబు వచ్చి మా దగ్గర పని చేశారు
- నేను పోయి అక్కడ పనిచేయొద్దా?
- బాబు నాకిచ్చిన గిఫ్ట్ కు నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొద్దా!
‘తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబునాయుడు గారు చెప్పారు. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్ కు లేదా? తప్పకుండా, తెలుగు ప్రజలు బాగుండాలని వందశాతం నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ లక్షకు పైగా ఫోన్లు వచ్చాయి. ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ మెస్సేజ్ లు బోలెడు వచ్చాయి. మా వాళ్ల ఫోన్లు పగిలి పోయే పరిస్థితి!
నేను సరదాగా చెప్పట్లేదు.. నిజాయతీగా చెబుతున్నాను. ‘మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి’ అని అడుగుతున్నారు. దేశ రాజకీయాలు బాగు చేసే క్రమంలో, తెలుగు ప్రజల గౌరవం పెరగాలనంటే కలిసి పనిచేయాలి..చేస్తాం. చంద్రబాబునాయుడుగారొచ్చి మా దగ్గర పని చేశారు. నేను పోయి అక్కడ పనిచేయొద్దా? బర్త్ డే పార్టీకి గిఫ్ట్ ఇస్తే.. మళ్లీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా? ఇవ్వమా? ఇవ్వకపోతే మనది తప్పయితది. చంద్రబాబునాయుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ కు నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదనుకో.. ‘తెలంగాణ వాళ్లు సంస్కార హీనులు’ అంటారు. కాబట్టి, నా ఫ్రెండ్ చంద్రబాబునాయుడికి వందశాతం రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.