అమెరికా అధ్యక్షుడి దీపావళి విందు... ఒబామా సంప్రదాయాన్ని కొనసాగించనున్న ట్రంప్
- స్పష్టం చేసిన వైట్‌హౌస్
- విందులో వీసాల గురించి చర్చించే అవకాశం
- గతంలో ఇఫ్తార్ విందు సంప్రదాయాన్ని రద్దు చేసిన ట్రంప్
ఈ విందులో భాగంగా భారతీయులకు వీసా సంబంధిత అంశాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీసాల విషయంలో సానుకూలంగా స్పందించడమేగాక, గతంలో షికాగో ప్రదర్శనలో భారత అమెరికన్లు చేసిన విజ్ఞప్తులను కూడా ట్రంప్ పరిశీలించే అవకాశాలున్నాయని ట్రంప్ మద్దతుదారు, రిపబ్లికన్ హిందూ కూటమి వ్యవస్థాపకుడు షాలభ్ కుమార్ తెలిపారు.
కొన్ని దశాబ్దాల నుంచి రంజాన్ సందర్భంగా వైట్‌హౌస్‌లో ఇస్తున్న ఇఫ్తార్ విందు సంప్రదాయాన్ని ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అదే కోవలో 2009లో ఒబామా ప్రారంభించిన దీపావళి విందు సంప్రదాయాన్ని ట్రంప్ కచ్చితంగా రద్దు చేస్తారని కొంతమంది భావించారు. అయితే ఇటీవల దీపావళి విందు వేడుకలు చేయడం గురించి రిపబ్లికన్ సెనేటర్ ఓరిన్ హాచ్ రాసిన లేఖకు వైట్‌హౌస్ సానుకూలంగా స్పందించడంతో భారతీయులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.