భక్తులతో కృష్ణుడు వెళ్లకుండా అలా చేస్తారట

శ్రీకృష్ణుడి భక్తులు .. ఆయనను అనునిత్యం సేవించేవారు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే క్షేత్రం 'బృందావనం'. పరమ పవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించేవారికి 'బాంకే బిహారి' ఆలయం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి 'నిధివనం'లో 'తాన్ సేన్' గురువైన హరిదాసుకి ఈ కృష్ణుడి మూర్తి దొరికిందని అంటారు. ఇక్కడి ఆలయంలోని శ్రీకృష్ణుడి మూర్తికి అడ్డుగా మాటిమాటికీ తెరవేస్తూ .. తీస్తూ వుంటారు. ఇలా చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం ఒకసారి జైపూర్ మహారాణి స్వామివారి దర్శనం చేసుకుని, తనతో పాటు తన ఇంటికి కృష్ణుడు కూడా వస్తే బాగుండును కదా అని మనసులో అనుకుందట. దర్శనం చేసుకుని ఆమె వెళుతూ వుంటే కృష్ణుడు కూడా ఆమెను అనుసరించాడు. తన వెనుక కృష్ణుడు వస్తున్నాడనే విషయం ఆ మహారాణికి తెలియదు. ఆలయంలో స్వామివారు కనిపించకపోవడంతో, అర్చకులు కంగారు పడిపోయారు. ఆయన అడుగుల ముద్రలను గుర్తిస్తూ వెళ్లిన వాళ్లకి కొంత దూరంలో కృష్ణుడు కనిపించడంతో, ఆయనను బతిమాలి తీసుకొచ్చినట్టుగా చెబుతారు. అల్లరివాడైన కృష్ణుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్లిపోతాడోనని అర్చకులు అలా తరచూ తెరవేస్తూ .. తీస్తూ ఉంటారట. ప్రత్యక్షంగా కొలువైన ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.      


More Bhakti News