Surya Kumar Yadav: 'సూర్య'ప్రతాపం.. సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ విక్టరీ

Surya Kumar Yadav ton helps Mumbai Indians victory over Sunrisers
  • సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో 174 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ముంబై ఇండియన్స్
  • 51 బంతుల్లోనే సెంచరీ బాదిన సూర్య కుమార్ 
  • ఈ ఓటమితో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశం సంక్లిష్టం
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ముంబై ఇండియన్స్ గట్టి షాక్ ఇచ్చింది. సోమవారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో 174 పరుగుల లక్ష్యాన్ని ముంబై సునాయాసంగా ఛేదించింది. 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
 
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై ప్లేయర్లు రాణించారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లోనే 102 పరుగులు బాది నాటౌట్‌‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. యువ బ్యాటర్ తిలక్‌ వర్మ సూర్యకి చక్కటి సహకారం అందించాడు. 32 బంతుల్లో 37 పరుగులతో నాటౌట్‌గా కడవరకు క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ నాలుగవ వికెట్‌కు ఏకంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుని విజయ తీరాలకు తీసుకెళ్లారు.

ముంబై ఇండియన్స్ 31 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయిన సమయంలో సూర్య, తిలక్ వర్మ ఈ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (9), రోహిత్ శర్మ (4) పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నమన్ ధిర్ కూడా డకౌట్ అయ్యాడు. దీంతో ముంబై ఇబ్బందుల్లో పడుతుందేమో అనిపించింది. కానీ సూర్య, తిలక్ వర్మ ప్రత్యర్థి బౌలర్లను సమర్థమంతంగా ఎదుర్కొని ఆడారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్‌, యన్‌సెన్, ప్యాట్ కమ్మిన్స్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (48), ప్యాట్‌ కమిన్స్‌ (35 నాటౌట్) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లో పియూష్‌ చావ్లా, హార్దిక్‌ పాండ్యా చెరో 3 వికెట్లు, బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ తీశారు.

కాగా ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 6 ఓటములు ఎదుర్కొంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవడంతో పాటు రన్‌రేట్, ఇతర జట్ల గెలుపోటములు కూడా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. కాగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ దాదాపు నిష్ర్కమించినట్టే చెప్పాలి. టెక్నికల్‌గా అవకాశం కనిపిస్తున్నా అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
Surya Kumar Yadav
Sunrisers Hyderabad
Mumbai Indians
IPL 2024
Cricket

More Telugu News