కష్టాలను గట్టెక్కించే వేంకటేశ్వరుడు

కష్టాలను గట్టెక్కించే వేంకటేశ్వరుడు
వేంకటేశా .. అనే పిలుపుతోనే ఆపదల నుంచి .. కష్టాల నుంచి బయటపడటం జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మానవుల కష్టాలను తీర్చడం కోసమే స్వామి భూలోకాన కొలువుదీరాడని స్పష్టం చేస్తున్నాయి. అలా వేంకటేశ్వర స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు కొన్నయితే, భక్తులు బలమైన సంకల్పంతో నిర్మించినవి మరికొన్ని. అలాంటి ఆలయాలలో ఒకటి నల్గొండ జిల్లా 'మల్లేపల్లి'లో కనిపిస్తుంది.

ఇక్కడ స్వామివారు కొండపై కొలువైన కారణంగా కొండమల్లేపల్లి అని కూడా పిలుస్తుంటారు. దేవరకొండకి సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఓ భక్తుడు ఈ కొండపై స్వామివారి ఆలయాన్ని రాజగోపురంతో సహా నిర్మించి, నిర్వహణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు. కొండపైకి చేరుకోవడానికి మెట్లదారి .. ఘాట్ రోడ్ రెండూ వున్నాయి. కొండ దిగువున గల హనుమంతుడిని దర్శించుకుని భక్తులు కొండపైకి చేరుకుంటారు.

గర్భాలయంలో స్వామి నిలువెత్తున .. నిండుగా దర్శనమిస్తూ ఉంటాడు. ప్రత్యేక మందిరాల్లో అమ్మవార్లు కొలువై దర్శనమిస్తూ వుంటారు. స్వామివారి రూపం దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతూ ఉంటుంది. సుందరమైన ఆయన రూపాన్ని చూస్తూ అలాగే నుంచుండిపోవాలనిపిస్తుంది. ఇక్కడి స్వామిని పూజించడం వలన కష్టాల నుంచి వెంటనే బయటపడటం జరుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. విశేషమైన పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించి తీరవలసిందే.
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles