దేనికైనా ప్రాప్తం వుండాలి

దేనికైనా ప్రాప్తం వుండాలి
దేనికైనా ప్రాప్తం వుండాలి అనే మాటను చాలా సందర్భాల్లో వింటూ వుంటాం. దక్కుతుందని అనుకున్నది దక్కకుండా పోయినప్పుడు నిరాశా నిస్పృహలతో ఈ మాటను అనుకుంటూ వుంటారు. ఉన్నతమైన విద్యను అభ్యసించాలని అనుకున్నప్పుడు .. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు .. వివాహం విషయంలో ఆశించిన సంబంధం కుదురుతుందని అనుకున్నప్పుడు .. ఆస్తి వ్యవహారాలలో తీర్పు తమకి అనుకూలంగా వస్తుందని ఆశపడినప్పుడు ఒక్కోసారి నిరాశ ఎదురవుతూ వుంటుంది.

అలాంటప్పుడే '' ఏం చేస్తాం .. మనకింత వరకే ప్రాప్తం వుంది'' అని నిట్టూర్చుతుంటారు. ప్రాప్తం అనేది కర్మఫలంపై ఆధారపడి వుంటుంది. పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యాలను బట్టి ఎవరికి ఏది దక్కాలో ... ఎంతవరకూ దక్కాలో నిర్ణయం జరిగిపోతుంటుంది. ఒకరు ఎంతగా కష్టపడినా లభించనిది, మరొకరు తేలికగా పొందడానికి గల కారణమిదే.

అయితే మనకింతవరకే ప్రాప్తం అని సరిపెట్టుకోవడమే అన్నివిధాలా మంచిది. ధనమైనా ... అధికారమైనా .. మరేదైనా సరే తమ సొంతమవుతుందని అనుకున్నది మరొకరికి దక్కినప్పుడు ఈర్ష్యా .. అసూయ .. ద్వేషం మొదలైనవాటిని ప్రదర్శించకూడదు. అలా చేయడం వలన ఆశించినది దక్కకపోగా, వున్న మనశ్శాంతి కూడా కరువవుతుంది.

భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించుకుని దాని సాయంతో అనుకున్నది సాధించవచ్చు. అలా కాకుండా ఈర్ష్యా .. అసూయ .. ద్వేషాలను పెంచి పోషిస్తే అవి అవతలవారికంటే ఎక్కువగా తమకే నష్టాన్ని కలగజేస్తుంటాయని గ్రహించాలి. అందుకే ఆశించినది ఎంతైనా .. అందులో దక్కింది కొంతే అయినా సంతోషించాలి ... సంతృప్తిచెందాలి. ఎవరికి ఎంత దక్కాలో అంతే దక్కుతుందని గ్రహించాలి.
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles