హనుమంతుడి కార్యదీక్ష అటువంటిది

హనుమంతుడి కార్యదీక్ష అటువంటిది
సాధారణంగా ఒక కార్యభారాన్ని స్వీకరించినప్పుడు దానిని ఎంతో జాగ్రత్తగా ... నేర్పుగా పూర్తిచేయవలసి వుంటుంది. ఆ కార్యాన్ని అప్పగించినవారికి తమపై గల విశ్వాసాన్ని గుర్తుచేసుకుంటూ, కార్యభంగం కాకుండా నడచుకోవాలి. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వున్నా ... బద్ధకం వహించినా ... తొందరపడినా ఒక్కోసారి సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోతూ వుంటుంది.

అందువలన కార్యభారాన్ని స్వీకరించిన తరువాత అనుక్షణం అప్రమత్తతో వ్యవహరిస్తూ, అవసరమైన చోట బుద్దినీ ... పరాక్రమాన్ని ఉపయోగిస్తూ ముందుకుసాగాలి. ఎవరైతే కార్యభారాన్ని అప్పగిస్తారో, వారిపై సేవకులకు గల ప్రేమాభిమానాలే ఆ కార్యాన్ని అంకిత భావంతో పూర్తి చేయడానికి దోహదం చేస్తుంటాయని చెప్పొచ్చు. శ్రీరామచంద్రుడు ... హనుమంతుడు విషయంలో ఇదే మనకి స్పష్టంగా తెలుస్తూ వుంటుంది.

రాముడి కోరిక మేరకు సీతాన్వేషణకు హనుమంతుడు బయలుదేరుతాడు. శ్రీరాముడి మాటలను బట్టి ఆయన భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో గ్రహిస్తాడు. అలాగే సీతమ్మవారిది ఎంతటి సున్నితమైన మనసో అర్థం చేసుకుంటాడు. ఇక ఆమెను అపహరించిన రావణుడు ఎంతటి పరాక్రమవంతుడో ఊహిస్తాడు. ఇక్కడ శ్రీరాముడి మనసు తేలిక పడాలన్నా ... అక్కడ సీతమ్మ తల్లికి ధైర్యంగా ఉండాలన్నా తన అన్వేషణా కార్యక్రమం సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకుంటాడు.

ధృఢ నిశ్చయంతో ఆయనలా ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ వుంటాడు. బాగా అలసిపోయినా కార్యదీక్షతో ముందుకి సాగుతుంటాడు. మార్గ మధ్యంలో ఆయనకి 'మైనాకుడు' (పర్వతుడు) తారసపడతాడు. తనపై కాసేపు విశ్రాంతి తీసుకోవలసిందిగా కోరతాడు. రామ కార్యాన్ని సాధించడానికి వెళుతున్నానంటూ, మైనాకుడి అభ్యర్థనను హనుమంతుడు సున్నితంగా తిరస్కరిస్తాడు.

కన్నీళ్లు దాచుకోవడానికి ప్రయత్నిస్తోన్న శ్రీరాముడి మోము తన కనులముందు కదలాడుతుండగా, తాను విశ్రాంతి తీసుకోలేనని మైనాకుడితో హనుమంతుడు చెబుతాడు. రాముడి కళ్లలో ఆనందం చూసే వరకూ తాను సమయాన్ని వృథా చేయదలచుకోలేదని అంటాడు. హనుమంతుడి కార్యదీక్షను మైనాకుడు అభినందించగా, తన పట్ల చూపిన అభిమానానికి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ హనుమంతుడు ముందుకు సాగిపోతాడు.

More Bhakti Articles