కన్యాకుమారి అనే పేరు ఎలా వచ్చింది ?

కన్యాకుమారి అనే పేరు ఎలా వచ్చింది ?
సముద్ర గర్భం నుంచి సూర్యుడు ఉదయించే దృశ్యం మనోహరంగా వుంటుంది. అదే సూర్యుడు సాయంత్రమయ్యేసరికి సముద్ర గర్భంలోకి జారిపోయే దృశ్యం ఆహ్లాదకరంగా వుంటుంది. ఈ రెండు దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసుపై మరిచిపోలేనంతగా నిలిచిపోతాయి. అపూర్వమైన ఆ దృశ్యాలకు వేదికగా నిలుస్తోన్న ప్రదేశంగా 'కన్యాకుమారి' కనిపిస్తుంది. సూర్యోదయ .. సూర్యాస్తమయాలు ఆవిష్కరించే అందమైన అనుభూతిని సొంతం చేసుకోవడానికి ఇక్కడికి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

ఇంతటి విశేషాన్ని కలిగివున్న 'కన్యాకుమారి'కి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణం కథనం వినిపిస్తుంది. లోక కంటకుడైన బాణాసురిడిని సంహరించడం కోసం, ఆదిపరాశక్తి అయిన అమ్మవారు భూలోకంలో 'కన్య' గా ఆవిర్భవిస్తుంది. అయితే సహజంగానే పరమశివుడు ఆమెకి తారసపడటం, ఆమె ఆయన పట్ల మనసు పారేసుకోవడం జరిగిపోతుంది.

ఇద్దరూ కలిసి వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఈ విషయం తెలిసి నారదమహర్షి తీవ్రమైన ఆందోళనకి లోనవుతాడు. కన్య చేతిలో మాత్రమే బాణాసురుడు మరణించవలసి వుంది. అందువల్లనే అమ్మవారు అక్కడ కన్యగా అవతరించింది. ఇప్పుడు శివుడితో ఆమె వివాహం జరిగితే, ఇక బాణాసురుడి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. దేవతలకు ... సాధుజనులకు రక్షణ లేకుండా పోతుంది.

అందువలన లోక కల్యాణం కోసం శివుడితో కన్య వివాహం జరగకుండా చూస్తాడు నారదమహర్షి. ఆయన ప్రయత్నం ఫలించి ... బాణాసురుడిని కన్య సంహరిస్తుంది. ఆ తరువాత ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోతుంది. కన్యగా ఆవిర్భవించిన అమ్మవారు ఇక్కడే స్థిరంగా వుండిపోవడంతో ఈ ప్రదేశానికి 'కన్యాకుమారి' అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.

More Bhakti Articles