ఆధ్యాత్మిక చింతన అప్పుడు మొదలవుతుంది

ఆధ్యాత్మిక చింతన అప్పుడు మొదలవుతుంది
ఆధ్యాత్మిక చింతన అనేది కొందరిలో ఎక్కువగాను ... మరి కొందరిలో తక్కువగాను కనిపిస్తూ వుంటుంది. ఇంకొందరిలో అసలు ఇది ఏ మాత్రం కనిపించదు. అందుకు ప్రధాన కారణం వాళ్లు పెరిగిన వాతావరణమేనని చెప్పుకోవాలి. సాధారణంగా ఆధ్యాత్మిక చింతనకు అహంకారం ... మమకారం అడ్డుపడుతూ వుంటాయి.

రాతి విగ్రహాలను దైవ స్వరూపంగా భావించి పూజించడం కొంతమందికి నచ్చదు. అలా ఆరాధించే వాళ్లందరినీ వీళ్లు చిత్రంగా చూస్తూ, తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. ప్రతి విజయానికి తాము మాత్రమే కారకులమని వీళ్లు వాదిస్తూ వుంటారు. ఇంకొందరు నాది ... నావాళ్లు అనే వ్యామోహంలో కొట్టుకుపోతుంటారు. ఈ విషయానికే వీళ్లు పూర్తి సమయాన్ని కేటాయించడం వలన ఆధ్యాత్మిక చింతన అనేది అసలు కనిపించదు.

ఈ రెండు రకాల మనస్తత్త్వం కలిగిన వారిని కొన్ని రకాల పరిస్థితులు చుట్టుముడతాయి. అహంకారంతో సర్వం తామే అనుకున్న వాళ్లు, తాము నిమిత్తమాత్రులమని తెలుసుకుంటారు. అలాగే నాది ... నావాళ్లు అనే వ్యామోహంలో చిక్కుకున్న వాళ్లు నిజానిజాలను గ్రహిస్తారు. ఎప్పుడైతే అహంకారం ... మమకారం వదిలివేయబడతాయో, అప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది.

తన కండబలమే తన ఆకలి తీరుస్తుంది తప్ప అందులో దేవుడి ప్రమేయమే లేదని అహంకరించిన కన్నప్ప, తన భార్యాబిడ్డల కడుపు నింపడం కోసం పాపాలకి పాల్పడిన వాల్మీకి ఆ తరువాత నిజానిజాలను గ్రహించి ఆధ్యాత్మిక చింతనవైపు అడుగువేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

More Bhakti Articles