ఇలా చేస్తే దుఃఖం దూరమవుతుంది !

ఇలా చేస్తే దుఃఖం దూరమవుతుంది !
కాలు తడవకుండా సముద్రాన్ని ... కన్ను తడవకుండా జీవితాన్ని దాటలేమని ఒక మహానుభావుడు సెలవిచ్చాడు. నిజంగానే దుఃఖానికి దూరంగా జీవిచడం అసాధ్యమనే చెప్పాలి. అయితే ఈ దుఃఖానికి ఒక్కోసారి 'విధి' కారణమవుతూ వుంటుంది. ఒక్కోసారి ఎవరి దుఃఖానికి వాళ్లే కారకులవుతుంటారు. విధి వక్రించడం వలన ఎవరికైనా దుఃఖం కలిగితే, సాటి వాళ్లు సానుభూతిని చూపుతారు. స్వయంకృతాపరాథమైతే ఎవరూ పలకరించరు ... పట్టించుకోరు.

ఇక ఎవరికి వాళ్లు దుఃఖాన్ని కొనితెచ్చుకోవడానికి కారణం కోరికలేనని చెప్పాలి. మితిమీరిన కోరికలే మనిషిని అధోగతిపాలు చేస్తుంటాయి. అద్దె ఇళ్లలో అవస్థలు పడుతోన్న వాళ్లు సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకోవడంలో తప్పులేదు. చిన్నపాటి స్థలం కొనుక్కోవడానికి ఎంతోకాలం కష్టపడతారు. తీరా తగిన డబ్బు సమకూరాక, మరికాస్త పెద్ద స్థలం తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుచేస్తారు.

సొంత ఇంటి కోరిక త్వరగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో, స్థలానికి సంబంధించిన అప్పు తీరక ముందే అందులో ఇల్లు కట్టేస్తారు. అక్కడ కూడా రాజీ పడకపోవడం వలన మళ్లీ అప్పు చేయవలసి వస్తుంది. సొంతిల్లు కట్టుకున్నా అందులో మనశ్శాంతిగా ఉండలేని పరిస్థితి వస్తుంది. ఈ దుఃఖానికి కారకులు ఎవరంటే ... కోరికలేనని చెప్పక తప్పదు. మితిమీరిన కోరికలు తీరని దుఃఖానికి గురిచేస్తుంటాయి.

మనసులోని కోరికలను నియంత్రించగలిగితే దుఃఖం దూరమవుతుంది. ఎక్కడైతే కోరికలు నియంత్రించబడతాయో అక్కడ సంతోషం ... సంతృప్తి శాశ్వతంగా - స్థిరంగా వుంటాయి. సంతృప్తిని మించిన సంపదలేదని భావించే వాళ్లతో ప్రశాంతత సహవాసం చేస్తుంది. ప్రశాంతత అనేది భగవంతుడిపట్ల ఏకాగ్రతను కలిగిస్తుంది. ఏకాగ్రత భగవంతుడి మనసు గెలుచుకుని ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అప్పుడు ఆ భగవంతుడే తన భక్తుల ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తాడు ... వాళ్లు ఆశించే గమ్యానికి చేరుస్తాడు.

More Bhakti Articles