కొలిచినంతనే సకల శుభాలనిచ్చే తులసి

కొలిచినంతనే సకల శుభాలనిచ్చే తులసి
తులసిమొక్క ఎంతో పవిత్రమైనది ... విశిష్టమైనది ... మహిమాన్వితమైనది. ఆరోగ్య పరంగాను ... ఆధ్యాత్మిక పరంగాను మానవాళికి తులసి చేసే మేలును మాటల్లో చెప్పలేం. తులసి మొక్క ... తులసీ దళం ... తులసి తీర్థం ఆధ్యాత్మిక జీవితాన్ని అనూహ్యమైన రీతిలో ప్రభావితం చేస్తుంటాయి.

తులసి మొక్కను చూడటం వలన ... తులసి తీర్థం సేవించడం వలన ... తులసికి నమస్కరించడం వలన ... తులసికి ప్రదక్షిణం చేయడం వలన సమస్త దోషాలు నశించి, సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. తులసి ఎందుకు ఇంతటి ప్రత్యేకతను సంతరించుకుందంటే, త్రిమూర్తులతో పాటు ఎంతోమంది దేవతలకు ఇది నివాసస్థానంగా ఉండటమే. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది కనుక, విష్ణుమూర్తి కూడా ఇక్కడే కొలువై ఉంటాడు.

తులసి లక్ష్మీదేవి స్వరూపం కనుకనే, తులసి దళాలతో తనని పూజించడాన్ని శ్రీమన్నారాయణుడు ఇష్టపడతాడని అంటారు. తులసి మాలలతో తనని సేవించినవారిని త్వరగా అనుగ్రహిస్తాడని చెబుతారు. స్వామివారి పాదాలచెంత ఒక్క తులసిదళాన్ని సమర్పించడం వలన, అనేక రకాలైన పూలతో స్వామిని సేవించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. దీనిని బట్టి స్వామివారి పూజలో తులసికి గల ప్రాధాన్యతను అర్థం చేసికోవచ్చు. ఈ కారణంగానే ప్రతి ఇంట్లో తులసి .. పూజలు అందుకుంటూ వుంటుంది.

సాధారణంగా స్త్రీలు తమ సౌభాగ్యానికి మించిన సంపదలేదని భావిస్తుంటారు. అందువలన తమకు స్థిరమైన సౌభాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా తులసిని కోరుతూ వుంటారు. ఉదయం వేళలోను ... సాయం సమయంలోను తులసిని పూజిస్తూ వుంటారు. తులసిలో సకల దేవతలు ... సమస్త పుణ్యతీర్థాలు నిక్షిప్తమై వుండటం వల్లనే అది దైవారాధనలో ప్రముఖమైన పాత్రను పోషిస్తోంది. తనని పూజించిన భక్తులకు సకల శుభాలను ప్రసాదించగలుగుతోంది.

More Bhakti Articles