పచ్చగన్నేరు పూలతో ఎవరిని పూజించాలి ?

పచ్చగన్నేరు పూలతో ఎవరిని పూజించాలి ?
పచ్చగన్నేరు పూలతో గురుగ్రహాన్ని పూజించాలని శాస్త్రం చెబుతోంది. నవగ్రహాలలో ఒక్కొక్కరిని ఒక్కోరకం పూలతో పూజించడం వలన వాళ్లు శాంతించి అనుగ్రహిస్తారని అంటారు. ఈ నేపథ్యంలో గురుగ్రహానికి ... అంటే బృహస్పతికి సంబంధించినవిగా పచ్చగన్నేరు పూలు చెప్పబడుతున్నాయి.

సాధారణంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా దగ్గరలో గల ఆలయాలకి వెళుతూ వుంటారు. ఆయా దైవాలను ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్లకి ఎంతో ప్రీతికరమైన పూలను సమర్పిస్తుంటారు ... నైవేద్యాలను చేయిస్తుంటారు.

ఇక వచ్చిన కష్టాలు గ్రహ సంబంధమైనవే అయితే, వాళ్లను ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తూ వుంటారు. ఏ గ్రహానికి ఏ పూలు ఇష్టమైనవో తెలుసుకుని, వాటితో వారిని పూజిస్తూ వుంటారు. జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా ... విజయాలు సాధించాలన్నా జ్ఞానం అవసరం. అలాంటి జ్ఞానాన్ని ఒక్క గురువు మాత్రమే ప్రసాదిస్తూ వుంటాడు. ఇక గురువు ఆశీస్సులు బలమైనవి ... తిరుగులేనివి. అందుకే గురువు దగ్గరికి వెళ్లిన వాళ్లెవరూ ఆయన ఆశీస్సులు తీసుకోకుండా తిరిగిరారు.

ముఖ్యంగా స్త్రీ పురుషుల జీవితంలో అత్యంత ప్రధానమైన వైవాహిక జీవితం, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా జరగాలంటే, ఆయన ఆశీస్సులు ఉండాల్సిందే. గురువు ఆశీస్సుల వల్లనే సంతోషకరమైన ... సంతృప్తికరమైన జీవితం సొంతమవుతుంది కనుక, ఆయనకి అత్యంత ప్రీతికరమైన పచ్చగన్నేరు పూలతో సేవించవలసిందే.

More Bhakti Articles