పూజలో ఎలాంటి అక్షింతలు ఉపయోగించాలి ?

పూజలో ఎలాంటి అక్షింతలు ఉపయోగించాలి ?
దైవ సంబంధమైన కార్యక్రమాల్లోనూ ... శుభకార్యాల్లోను అక్షింతలు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటాయి. భగవంతుడిని అర్చించడానికీ ... పిన్నవయసులో వున్నవారిని ఆశీర్వదించడానికి ... పూజ అనంతరం తలపై ధరించడానికి అక్షింతలను ఉపయోగిస్తూ వుండటం విశేషం. కొన్ని ప్రత్యేకమైన పూజల్లో పూలు ... గంధం ... మొదలైనవాటికి బదులుగా కూడా అక్షింతలను సమర్పిస్తూ వుండటం జరుగుతుంది.

ఇంతటి విశిష్టమైన పాత్రను పోషిస్తోన్న అక్షింతలను కొంతమంది తమ బలమంతా ఉపయోగించి కలిపేస్తుంటారు. దీనివలన అక్షింతలు మొనలు విరిగిపోయి 'నూక'గా మారిపోతుంటాయి. నిజానికి అలాంటి అక్షింతలను వాడకూడదు. అక్షింతలు అంటే 'కొసలు విరగని బియ్యం'గా చెప్పడం జరుగుతోంది గనుక, నాణ్యమైన ... కొసలు విరగని బియ్యాన్ని తీసుకుని, అవి పొడి కాకుండా తేలికగా కలపాలి.

ఇక కొంతమంది ఒకసారి ఒక పూజా సమయంలో కలిపిన అక్షింతలనే చాలాకాలంపాటు మిగతా పూజల్లోను వాడుతూ వుంటారు. ఈ విధంగా నిలవవున్న అక్షింతలను పూజలో ఉపయోగించకూడదని శాస్త్రం చెబుతోంది. ఏ పూజ చేస్తున్నా అంతకుముందు కలిపిన అక్షింతలు కాకుండా, తాజాగా ఆ పూజా సమయంలో కలిపిన అక్షింతలను మాత్రమే ఉపయోగించాలి. దైవారాధనకి సంబంధించి అక్షింతలను ఉపయోగించడంలో ఈ నియమాలను పాటించినట్టయితే, పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందని చెప్పవచ్చు.

More Bhakti Articles