ఏ పూలతో పూజిస్తే కుజుడు అనుగ్రహిస్తాడు ?

ఏ పూలతో పూజిస్తే కుజుడు అనుగ్రహిస్తాడు ?
వివిధ రకాల పూలను చూసినప్పుడు ... వాటికి ఆ రంగులను ... పరిమళాలను ఇచ్చిన సృష్టికర్తను అభినందించకుండా ఉండలేం. ఈ పూల సోయగాలను కనులారాచూసి తరించేందుకే దేవతలు భూలోకానికి దిగివచ్చారేమోనని అనిపించకమానదు. వికసించి వాడిపోయేలోగా భగవంతుడి సేవలో తరించాలనే సత్యాన్ని పూలు చాటిచెబుతుంటాయి. అలాంటి పూలు లేకుండా ఏ దైవకార్యంగానీ ... శుభకార్యంగాని జరగదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ పూలలో ఒక్కో రకానికి చెందిన వాటిని ఒక్కో దైవం ఇష్టపడుతూ వుంటుంది. ఆయా దైవాలు ఇష్టపడే పూలను గురించి తెలుసుకుని పూజించడం వలన, వారి అనుగ్రహం త్వరగా కలుగుతుందని చెప్పబడుతోంది. ఇదే పద్ధతి మనకి నవగ్రహాల విషయంలోనూ కనిపిస్తుంది. ఒక్కో గ్రహానికి ఒక్కో రకం పూలు ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుజ గ్రహ సంబంధమైన పుష్పాలుగా 'పారిజాతాలు' కనిపిస్తుంటాయి. కుజ దోషం అనేక విధాల సమస్యలను సృష్టిస్తూ వుంటుంది. తేరుకోనీయకుండా చేస్తూ, మానసికంగా కుంగదీస్తూ వుంటుంది.

అలాంటి పరిస్థితుల్లో కుజుడిని శాంతింపజేయడానికి ... ఆయన అనుగ్రహాన్ని పొందడానికి పారిజాతాలతో పూజించాలని శాస్త్రం చెబుతోంది. కుజుడికి పారిజాత పుష్పాలు ఎంతో ప్రీతికరమైనవిగా చెబుతుంటారు. ఆ పూలతో అనునిత్యం పూజించడం వలన ఆయన మనసు కరుగుతుంది. ఆయన అనుగ్రహంతో ఆ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. కుజ దోషంతో బాధలుపడేవారు, ఎలాంటి సందేహాలకు తావీయకుండా పారిజాతాలతో ఆయనని సేవించి ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు.

More Bhakti Articles