దక్షిణలేని దానం ఫలితాన్ని ఇవ్వదా ?

దక్షిణలేని దానం ఫలితాన్ని ఇవ్వదా ?
పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాలను బట్టే ఈ జన్మలో సుఖసంతోషాలు లభిస్తాయి. అలాగే ఈ జన్మలో చేసుకున్న పుణ్యమే ముందు జన్మలలో ఉత్తమగతులను కల్పిస్తుంది. ప్రశాంతమైన ... ఆనందకరమైన జీవితమనేది సంపాదించుకున్న పుణ్య ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. అంతటి విశేషాన్ని కలిగిన పుణ్యం ... భగవంతుడిని ఆరాధించడం వలన, దానధర్మాలను చేయడం వలన మాత్రమే ప్రాప్తిస్తుంది.

అందువలన వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ... విశేషమైన పర్వదినాల్లోను ఎవరి స్థాయిలో వాళ్లు దానధర్మాలు చేస్తుంటారు. ఇక కొన్ని కార్యక్రమాల్లో దానధర్మాలు చేసే సందర్భం ప్రత్యేకంగా వుంటుంది. ఈ నేపథ్యంలో ఆయా సందర్భాలను బట్టి కొంతమంది గోదానం ... మరికొందరు భూదానం ... ఇంకొందరు సువర్ణదానం ... వస్త్రదానం చేస్తుంటారు.

తాము చేస్తున్నది ఖరీదైన దానమనీ ... అందువలన అది మాత్రమే దానంగా ఇస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందువలన దక్షిణ వంటిది ఏమీ లేకుండానే ఆ కార్యక్రమాన్ని కానిచ్చేస్తుంటారు. తాము చేయాలనుకున్న దానం చేస్తూనే ఉన్నాం ... మళ్లీ దక్షిణ ఏమిటంటూ కొంతమంది వాదిస్తుంటారు. దానాన్ని తీసుకునే వాళ్ళే ఈ తంతును సృష్టించారని అనుకుంటూ వుంటారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజంలేదు.

దానం ఏదైనా దక్షిణతోనే ఇవ్వాలని శాస్త్రం బలంగా చెబుతోంది. దానంగా ఇచ్చేదానితో పాటు, రెండు తమలపాకులలో రెండు వక్కలు ... తోచినంత పైకం పెట్టి దక్షిణగా ఇవ్వాలి. దక్షిణ పెట్టకుండా చేసే దానం ఎంత విలువైనదైనా అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం స్పష్టం చేస్తోంది. అందువలన ఏ దానమైనా గానీ దక్షిణతో పాటుగా ఇచ్చినప్పుడే ఆ దానానికి సార్ధకత లభిస్తుందని గ్రహించాలి. ఈ నియమాన్ని అనుసరిస్తూ పరిపూర్ణమైన ఫలితాలను పొందాలి.

More Bhakti Articles