శ్రీ కృష్ణుడు ధరించిన హారం ప్రత్యేకత !

శ్రీ కృష్ణుడు ధరించిన హారం ప్రత్యేకత  !
అక్బర్ ఆస్థాన గాయకుడైన తాన్ సేన్ ఒకసారి ఆయన సమక్షంలో ఒక గీతాన్ని ఆలపిస్తాడు. ఆ గీతం ఆయనని మంత్రముగ్ధుడిని చేయడంతో, తాన్ సేన్ ని ప్రశంసిస్తాడు. ఆ అభినందనలు సూరదాస్ కి చెందుతాయనీ, అది ఆయన నోటివెంట ఆశువుగా వెలువడిన గీతమని తాన్ సేన్ చెబుతాడు. సూరదాస్ అంధుడనీ ... శ్రీకృష్ణుడి భక్తుడని తెలుసుకుని అక్బర్ ఆశ్చర్యపోతాడు. మధురమైన ఆయన గానాన్ని వినాలని ఉందనీ, ఒకసారి చూడాలని వుందని చెబుతాడు అక్బర్.

ఆయన ఆహ్వానంమేరకు సూరదాస్ అక్బర్ ఆస్థానానికి చేరుకుంటాడు. కృష్ణుడిపై ఆయన పాడిన పాట ఆక్కడి వాళ్లని పరవశులను చేస్తుంది. సూరదాస్ ని ప్రశంసిస్తూ తన మెడలోని హారాన్ని ఆయనకి అందజేస్తాడు అక్బర్. తాను అక్బర్ సమక్షంలో పాడటానికి కారకుడైన కృష్ణుడికే అది చెందుతుందనే ఉద్దేశంతో, మనో నేత్రం ద్వారా కనిపిస్తోన్న కృష్ణుడి మెడలో ఆ హారాన్ని విసురుతాడు సూరదాస్.

చూసే వాళ్లకి ఆ హారాన్ని ఆయన గాల్లోకి విసిరినట్టుగా కనిపిస్తుంది. దాంతో అక్బర్ సహాయకులు సూరదాస్ ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తారు. చక్రవర్తిని తను అవమానపరచలేదనీ, ఆయన బహుమతిగా ఇచ్చినది తాను కృష్ణుడికి కానుకగా సమర్పించానని సూరదాస్ అంటాడు. కావాలంటే దానిని తిరిగి తెప్పిస్తానంటూ, ఆ హారాన్ని తిరిగి ఇవ్వవలసినదిగా కృష్ణుడిని కోరతాడు.

అంతే గాల్లోకి విసరడం వలన అదృశ్యమైన హారం ... సూరదాస్ చెంతకి తిరిగి వస్తుంది. ఈ దృశ్యం చూసిన అక్బర్ ఆనందాశ్చర్యాలకి లోనవుతాడు. సూరదాస్ వంటి మధురకవినీ ... గాయకుడిని తాను అంత వరకూ చూడలేదంటూ అక్బర్ సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. సూరదాస్ కి భగవంతుడితో గల బంధాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగిందంటూ ఆత్మీయతతో అక్కున చేర్చుకుంటాడు. ఆయన కోరిక మేరకు తిరిగి ఆ హారాన్ని కృష్ణుడికే సమర్పిస్తాడు సూరదాస్.

More Bhakti Articles